మహా కుంభమేళా భక్తజనంతో పోటెక్కుతోంది. ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు మహా కుంభమేళాకు హాజరయ్యారు. తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహా కుంభమేళాకు హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక సందర్బంగా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు అధికారులు. ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. ఆ తరువాత వారితో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, బోటులో పర్యటించారు. బోటులో ప్రయాణిస్తూనే మార్గమధ్యంలో వలస పక్షులకు ఆహారం అందించారు. అనంతరం త్రివేణీ సంగమం దగ్గరకు చేరుకున్నారు. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా గంగానదికి ఆమె పూజలు చేశారు.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ కూడా మహా కుంభమేళాకు హజరయ్యారు. ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయంలో దిగిన ప్రధాని నరేంద్ర మోడీ అక్కడి నుంచి అరైల్ ఘాట్ కు వెళ్లారు. అరైల్ ఘాట్ నుంచి బోటులో ప్రయాణించారు. బోటులో ప్రయాణిస్తూనే, పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చిన కోట్లాది మంది భక్తులకు ఆయన అభివాదం చేశారు. ఆ తరువాత అతి పెద్ద ఆధ్యాత్మిక సంబురమైన మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి ఆయన చేరుకున్నారు. ఆ తరువాత పరమ పవిత్రమైన త్రివేణీ సంగమంలో ప్రధాని నరేంద్ర మోడీ పుణ్యస్నానం ఆచరించారు. కాగా ప్రధాని నరేంద్ర మోడీ వెంట ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు.
అంతకుముందు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. అమిత్ షాతో పాటు యోగా గురువు బాబా రామ్‌దేవ్, పలువురు సాధువులు, త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు అచరించారు. అమిత్ షాకు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. అంతకుముందు మహా కుంభ్‌మేళా పవిత్రతను వివరిస్తూ కేంద్ర మంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా ఒక పోస్టు పెట్టారు. భారతీయుల సనాత ధర్మానికి మహా కుంభమేళా ఒక ప్రతీక అన్నారాయన. మహా కుంభమేళా , వివిధ జాతుల మధ్య సామరస్యానికి చిహ్నమన్నారు అమిత్ షా. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం చేసి సాధు సంతుల ఆశీర్వాదం తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. చివరకు తన కోరిక నెరవేరిందన్నారు. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం చేసిన తరువాత తాను పొందిన అనుభూతిని మాటల్లో వర్ణించలేనన్నారు అమిత్ షా.
మహా కుంభమేళాకు ఒక ప్రత్యేకత ఉంది. 114 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మహా కుంభమేళా. ఈసారి జనవరి 13న మహా కుంభమేళా ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 వరకు ఈ ఆధ్యాత్మిక సంబురం కొనసాగుతుంది. అంటే మొత్తం 45 రోజుల పాటు మహా కుంభమేళా జరుగుతుందన్నమాట. ఇప్పటికే 44 కోట్ల మంది భక్తులు మహా కుంభమేళాకు హాజరయ్యారు. పవిత్రమైన త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.