తెలంగాణా ఆవిర్భావ వేడుకల నిర్వహణకు అధికార యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 2వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ అవతరణ వేడుకలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలతో సంబంధిత అధికారులు పరేడ్ గ్రౌండ్ లో ప్రధాన వేదికతోపాటు, ముఖ్య అతిథులకు, ఆహ్వనితులకు, అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వేరు వేరుగా ప్రత్యేక లాంజ్ లు ఏర్పాటు చేస్తున్నారు. వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో కార్య క్రమానికి విచ్చేసే వారందరికి అసౌకర్యం కలగకుండా భారీ టెంట్ లను ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు, త్రాగునీటి సౌకర్యం, తగు మొబైల్ టాయిలెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సమాచార పౌర సంబంధా ల శాఖ ఆధ్వర్యంలో ఎల్.ఈ.డీ స్క్రీన్ లు, కార్యక్రమ లైవ్ ప్రసారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 2 వ తేదీన సాయంత్రం ట్యాంక్ బండ్ పై పలు సాంస్కృతిక కార్యక్రమాలు, కార్నివాల్, బాణ సంచా లేజర్ షో, ఫుడ్, గేమింగ్ స్టాళ్ళను ఏర్పాటు చేస్తున్నారు. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసే పలు సాంస్కృతిక కార్య క్రమాలకు ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరవుతారు.