ఎన్నికల వేళ కర్ణాటక లోని హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ కుంభకోసం హాట్ చర్చనీయంశంగా మారింది. నారీ శక్తి వీధుల్లోకి వచ్చి ప్రజ్వల్ పైవచ్చిన లైంగిక వేధింపులు, అత్యాచారాలు , సెక్స్ వీడియో ల పై నిస్పాక్షిక విచారణకు డిమాండ్ చేస్తోంది. ఈ ఉదంతం బీజేపీ, జేడీఎస్ విజయావకాశాలకు పెద్ద ముప్పుగా పరిగణిస్తున్నారు. ఇప్పటికే హసన ఎంపీ స్థానానికి పోలింగ్ పూర్తయింది. పరారీలో ఉన్న ప్రజ్వల్ ను స్వదేశానికి తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రజ్వల్ రేవణ్ణ ఉదంతం కర్ణాటక రాజకీయాల్లో కాకలు రేపుతోంది. మునుపెన్నడూ లేని విధంగా లైంగిక వేధింపులు, దోపిడీలకు పాల్పడిన ప్రజ్వల్ రేవణ్ణ ఉదంతంతో రాజకీయ వర్గాలు దిగ్భ్రమకు గురయ్యారు. హసన్ సిట్టింగ్ ఎంపీ, జేడీఎస్-బీజేపీ అభ్యర్థి పెద్ద సంఖ్యలో మహిళలను దూషించారని, అసభ్యకరమైన వీడియోలను చిత్రీకరించారని ఆరోపణలు వచ్చాయి.హనస నియోజకవర్గంలో పోలింగ్ జరగడానికి కొద్ది రోజుల ముందే ఈ వీడియోలు, ముఖ్యంగా పెన్ డ్రైవ్ వెలుగులోకి రావడంతో ప్రజ్వల్ రేవణ్ణ దేశం విడిచి పారిపోయాడు. సాధారణంగా ఓ కుంభకోణానికి సంబంధించి వీడియోలు వెలుపలికి వస్తే.. వాటిలో నిజానిజాలపై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. వెంటనే ఆ వ్యక్తిగానీ, ఆ పార్టీ కానీ ఖండించడమో, ఆరోపణలు అసత్యాలని ఎదురు దాడికి దిగడమో జరిగేది. కానీ ప్రజ్వల్ కుటుంబం ఈ వీడియోలు వెలుగులోకి రావడానికి కాంగ్రెస్ ను దుమ్మెత్తి పోసింది తప్ప గట్టిగా ఖండించలేదు. అతడి పినతండ్రి కుమారస్వామి జేడీఎస్ పార్టీ నుంచి ప్రజ్వల్ ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. కాంగ్రెస్ ప్రజ్వల్ ఉదంతంపై సీరియస్ గానే స్పందించింది. ప్రత్యేక దర్యాప్తు టీమ్ – సిట్ ను ఏర్పాటు చేసింది. విచారణకు ఆదేశించింది. సిట్ వెంటనే రంగంలోకి దిగి ప్రజ్వల్ పై “లుక్ ఔట్” నోటీసు జారీచేసింది. ప్రజ్వల్ రేవణ్ణ తరుపు న్యాయవాది హసన ఎంపీ భారతదేశానికి తిరిగి వచ్చి, విచారణకు సిట్ ముందు హాజరయ్యేందుకు ఓవారం రోజులు గడువు కోరారు. మరో పక్క కర్ణాటకలో మహిళలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. యువత, విద్యార్థినులు రోడ్లపైకి వచ్చి ప్రజ్వల్ దిష్టిబొమ్మలు, ఫెక్సీలను దగ్ధం చేస్తూ.. నిస్పక్షపాత విచారణకు డిమాండ్ చేస్తున్నారు.
ఆరోపణలు రుజువైతే లైంగిక వేధింపులు, నిస్సహాయ మహిళలదోపిడీ , బ్లాక్ మెయిల్ చేసే ఉద్దేశం తో వీడియో చిత్రీకరణ వంటి నేరాలకు పాల్పడినందుకు ప్రజ్వల్ కు కఠిన మైన శిక్ష తప్పదు. ప్రజ్వల్ ను ఏ పార్టీ సమర్థించేదుకు సిద్ధంగా లేదు. ప్రజ్వల్ రేవణ్ణ దారుణాలపై గతంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని సొంత జిల్లా నాయకత్వం బాగా హెచ్చరించింది. కానీ ఆ పార్టీ ఆ హెచ్చరికలను పట్టించుకోక పోవడంతో ప్రధాని మోదీ హసన్ లో స్వయంగా ప్రజ్వల్, కుమార స్వామి తరుపున ప్రచారం చేశారు.
మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఎంపీలను సమర్థించడం బీజేపీకి ఇదే మొదటి సారి కాదు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించాడని ఆరోపణ వచ్చినా రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ పై వేటు వేయకుండా చోద్యం చూసింది. ఇలా ఆరోపణలు వచ్చినప్పుడు మహిళల డిమాండ్ ను పరిగణన లోకి తీసుకుని స్పందించడంతో మిగతా పార్టీలు ఇదే ధోరణి లో సాగాయి. ప్రజ్వల్ రేవణ్ణ కు సంబంధిం చిన వీడియోలు వెలుగులోకి రావడంతో కొందరు మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి తమకు జరిగిన ఘోరాలను ఏకరవు పెడుతున్నారు. ప్రజ్వల్ పై ఫిర్యాదు చేస్తున్నారు. చాలామంది ఇప్పటికీ వెనుకంజ వేస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో నిస్పాక్షికంగా దర్యాప్తు జరిపించి, బాధ్యులను కోర్టు ముందు నిలిపి, తగిన శిక్ష పడేటట్లు చూడాలి. మహిళలకు న్యాయం చేయాలి.


