పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి ఇప్పటి వరకూ ఒక్క అప్‌డేట్ కూడా ఇవ్వలేదు. షూటింగ్ కూడా గోప్యంగా చేస్తున్నారు. షూటింగ్ పూర్తి కావస్తున్నా.. ఈ సినిమా టైటిల్‌ను ఇంకా రివీల్ చేయలేదు. తన సినిమాల్లో హీరోలను ఎంతో స్టైలిష్‌గా చూపించే మారుతి.. ప్రభాస్‌ను ఏ రేంజ్‌లో చూపించబోతున్నాడో అనే సస్పెన్స్ బాగా ఏర్పడింది. ఈ సినిమాకు డీలక్స్ రాజా అనే టైటిల్‌ను అనుకుంటున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే వీటన్నింటికీ తెరదించుతూ.. సంక్రాంతి రోజున బిగ్ అప్‌డేట్ ఇవ్వబోతున్నారు మేకర్స్. అది కూడా ప్రభాస్ సొంతూరు భీమవరంలో భారీ ఈవెంట్ నిర్వహించి సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను కూడా రివీల్ చేయబోతున్నారు.
భీమవరం అంటేనే కోడిపందేలకు పెట్టింది. సంక్రాంతి పండుగకు మామూలుగానే అక్కడ భారీ హంగామా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ప్రభాస్ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ అక్కడ చేస్తున్నారనగానే మరింత క్రేజ్ ఏర్పడింది. భీమవరంలోని వెంపకాశీ కోడిపందెం బరి దగ్గర రేపు సాయంత్రం 6.30లకు డిజిటల్ కటౌట్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్ ఫ్యాన్స్ భారీగా తరలివస్తారని మేకర్స్ చెబుతున్నారు. సలార్ తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ధమాకా లాంటి సినిమాను నిర్మించి 100 కోట్లు రాబట్టిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తుండడంతో అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.


