స్వతంత్ర వెబ్ డెస్క్: బిగ్‌బాస్ 3 సీజన్ విన్నర్, ప్రముఖ టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడు. గతంలో ఎన్నో పాటలు పాడినప్పటికీ ఎందుకోగానీ రాహుల్ సిప్లిగంజ్‌కు పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. ఇక బిగ్‌బాస్ విన్నర్ అయ్యాక రాహుల్‌కు కాలం బాగా కలిసొచ్చింది. ఒక్కసారిగా ఆయన రేంజే మారిపోయింది. ఇక ఆర్ఆర్ఆర్‌లో ఆయన పాడిన పాటకు ఆస్కార్ రావడంతో రాహుల్ రేంజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం మాస్‌లో రాహుల్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఇటీవల రాజీవ్ గాంధీ యూత్ క్విజ్ పోటీల ప్రారంభోత్స వంసందర్భంగా కూడా రాహుల్ సిప్లిగంజ్‌ను కాంగ్రెస్ నేతలు ఆహ్వానించారు. ఇక ఇప్పుడు తాజాగా గోషామహల్ నుంచి పోటీ చేయాల్సిందిగా రాహుల్‌ను కాంగ్రెస్ నేతలు కోరారట. అయితే గోషామహల్ అంటే ఒకరకంగా రాజాసింగ్‌కు అడ్డా. ఆయనను ఎదుర్కొనేందుకు రాహుల్ బరిలోకి దిగుతున్నాడు. ఈ మేరకు ఇవాళ గాంధీభవన్‌లో టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. రూ.25 వేల డిపాజిట్ చెల్లించి తన పేరు నమోదు చేసుకున్నాడు. కాగా రాహుల్ ఇప్పటివరకు 50కి పైగా సినిమాల్లో పాటలు పాడాడు.
ఇక బీజేపీ నుంచి విజయశాంతి.. ఏకంగా సీఎం కేసీఆర్‌ను ఎదుర్కోబోతున్నారని టాక్. కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని విజయశాంతి అధిష్టానాన్ని కోరడం.. అధిష్టానం కూడా సానుకూలంగా ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక ఇటీవలే మరో సినీ నటి జయసుధ కూడా పార్టీలో జాయిన్ అయ్యారు. ఇక జయసుధ సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ స్థానాల్లో ఏదో ఒక చోటు నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది. పార్టీలకు సినీ గ్లామర్ ఏ మేరకు కలిసొస్తుందో ఇక చూడాలి.