విజయవాడలో కాలుష్య నియంత్రణ మండలి మాజీ ఛైర్మన్ ఆదేశాలతో పెద్ద ఎత్తున ఫైల్స్ తగులబెట్టిన వ్యవహారం కలకలం రేపింది. నిన్న రాత్రి కృష్ణా కరకట్టపై బస్తాల్లో ఫైల్స్ దగ్ధం చేశారు. మైనింగ్, పొల్యూ షన్ కంట్రోల్ బోర్డులకు చెందిన రికార్డులను గుట్టు చప్పుడు కాకుండా ధ్వంసం చేశారు.
యనమలకుదురు కట్ట మీద రోడ్డు వెంట బస్తాల్లో తెచ్చిన రికార్డుల్ని తగుల బెడుతుండటంతో గుర్తించిన స్థానికులు వారిని ప్రశ్నించారు. ఇప్పటికే మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇసుక తవ్వకాల వ్యవహా రంపై స్థానికులకు అవగాహన ఉండటంతో వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఫైల్స్ దగ్ధం చేస్తున్న వారు అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించడంతో వారిని వెంటపడి పట్టుకున్నారు. మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులకు చెందిన పత్రాలు, హార్డ్ డిస్క్‌లు దగ్ధమయ్యాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాజీ ఛైర్మన్ సమీర్ శర్మ ఆదేశాలతో పత్రాలను దగ్దం చేశామని డ్రైవర్ వివరించాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాజీ ఛైర్మన్ సమీర్ శర్మ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న నాగరాజు మరొకరితో కలిసి ఫైల్స్ దగ్ధం చేసినట్టు గుర్తించారు. ఈ ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
గత ప్రభుత్వంలో సిఎంఓలో పనిచేసిన రేవు ముత్యాల రాజుకు ఓఎస్‌డిగా ఉన్న సాయి గంగాధర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో సీనియర్ ఎ.ఎమ్‌గా కూడా విధులు నిర్వర్తించాడు. సిఎంఓతో పాటు మైనింగ్ శాకలో కూడా సాయి గంగాధర్ విధులు నిర్వర్తించినట్టు తెలుస్తోంది. మైనింగ్ శాఖ హెడ్ ఆఫీసులో సెక్షన్ హెడ్ శ్రీనివాస్, సమీర్ శర్మ ఒఎస్‌డి రామారావుల సూచనతో ఫైల్స్ తరలించినట్టు డ్రైవర్ నాగరాజు పోలీసులకు వివరించాడు. సమీర్ శర్మ ఆదేశాలతో కార్యాలయంలో ఉన్న డాక్యు మెంట్లు, హార్డ్ డిస్క్ లు గోను సంచుల్లో దాచిపెట్టామని, ఆ తర్వాత వాటిని కారుల్లో ఎక్కించుకుని తెచ్చి దగ్ధం చేసినట్లు వివరించాడు. కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలకు చెందిన బస్తాల కొద్దీ దస్త్రాలు ఈ ఘటనలో కాలిపోయాయి. గత ప్రభుత్వ హయంలో ఇసుక తవ్వకాలు, అమ్మకాల కు సంబంధించిన వివరాలతో పాటు అనధికారిక చెల్లింపుల వివరాలు బయట పడకుండా వ్యవహరించే క్రమంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.


