శాసన మండలిలో సంఖ్యాబలం పెంచుకోవడానికి టీ.కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇందుకు, అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హస్తం పార్టీ చూస్తోంది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మే 27న పోలింగ్ జరగనుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి ఉప ఎన్నికలు ఇవి. దీంతో, ఎలాగైనా ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఎమ్మెల్సీ స్థానం గెలుపు కోసం హస్తం పార్టీ ఎలాంటి వ్యూహరచన చేస్తోంది..? ఏ రీతిన పావులు కదుపుతోంది..?
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ విజయంలో విద్యార్థులు, నిరుద్యోగులు సైతం భాగస్వాములే. బీఆర్ఎస్ పై వ్యతిరేకత, హస్తం పార్టీ ఇచ్చిన హామీలు కాంగ్రెస్ కు విజయాన్ని చేకూర్చాయని చెప్పవచ్చు. రాష్ట్రంలో 65 స్థానాల్లో గెలుపొంది కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లోనే కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు వచ్చాయి. దీంతో, ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పాగా వేసేందుకు హస్తం పార్టీ స్కెచ్ లు వేస్తోంది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో రెండు సీట్లు మినహా మిగతా స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ఈ కారణంగానే ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గెలవాలని చూస్తోంది.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజార్టీ గా ఉన్నది విద్యార్థులు, నిరుద్యోగులే. విద్యార్థులు, నిరుద్యోగులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర నిరసన తెలిపారు. ఈ వ్యతిరేకత సైతం బీఆర్ఎస్ సర్కారు కూలడానికి ఓ కారణమైందని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం జరుగుతున్న ఎన్నికలు కావడంతో, ఇప్పుడు ఎలాగైనా ఈ ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేయాలని హస్తం పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే…తమ ప్రభుత్వం అయిదు నెలల పాలన పై ప్రజలు సానుకూలంగా ఉన్నారనే అభిప్రాయం వస్తుందని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు. కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికే జిల్లాల వారీగా ఇంచార్జ్ ల నియామక ప్రక్రియ చేపట్టారు. సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తో పాటు ఇంచార్జి దీపా దాస్ మున్షీ సైతం మానిటరింగ్ చేస్తున్నారు. మండలి పునరుద్ధరణ అనంతరం వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 2007, 2009,2015,2021లో వరుసగా గులాబీ పార్టీ గెలిచింది.ఈ ఎమ్మెల్సీ స్థానానికి 2021లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందడంతో, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది.
ఈ పట్టభద్రుల స్థానానికి ఉమ్మడి వరంగల్- ఖమ్మం- నల్గొండ పరిధిలో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లు ఉన్నారు.. ఇందులో 2,87,007 మంది పురుషులు కాగా, 1,74,794 మంది మహిళలు ఉన్నారు. అయితే, ఈ ఉపఎన్నికను మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలని బీఆర్ఎస్, ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని చేజిక్కించుకొని తమ గళాన్ని మరింత మండలిలో వినిపించాలని అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుండగా, బీజేపీ సైతం తన వంతు ప్రయత్నం చేస్తూ పోటీకి దిగింది. కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ను నిలిపింది. 2021 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న తీన్మార్ మల్లన్న.. రెండో స్థానంలో నిలిచి అధికార బీ ఆర్ ఎస్ పార్టీని ఖంగు తినిపించాడు. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన బరిలో దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నల్లేరుమీద నడకే అన్న ధీమాతో ఉంది. ఇప్పటికే ఉప ఎన్నికపై మూడు జిల్లాల ముఖ్య నేతలతో సమావేశాలను హస్తం పార్టీ పూర్తి చేసింది.
ఇప్పటికే నల్గొండ,ఖమ్మం,వరంగల్ పార్లమెంట్ పరిధిలో జరిగిన ప్రచార కార్యక్రమాల్లో, సభలు సమావేశాల్లో చింతపండు నవీన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని జనాలకు పరిచయం చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక ప్రచారంలో భాగంగా రాష్ట్ర ముఖ్య నేతలు కోచింగ్ సెంటర్లలో,యూనివర్సిటీల్లో విద్యార్థులతో సమావేశం అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఉద్యోగులను కలిసే బాధ్యత ను కాంగ్రెస్ అనుబంధ సంస్థలుగా ఉన్న ఉద్యోగ సంఘాలకు అప్పజెప్పారు. విద్యార్థులు, ఉద్యోగులను కలిసే విధంగా ప్రచారాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మే 27న పోలింగ్ జరగనుంది. ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ప్రస్తుతమున్న 12 జిల్లాల పరిధిలో మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఈ ఎన్నికలు జరుగు తుండగా.. పట్టభద్రులు ప్రాధాన్యత క్రమంలో ఓటు హక్కు ను వినియోగించుకోనున్నారు. జూన్ 4 న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల జాతకాలు బయటపడిన గంటల వ్యవధిలోనే ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. గులాబీ పార్టీకి కంచుకోట గా ఉన్న ఉమ్మడి నల్గొండ,వరంగల్ ,ఖమ్మం ఎమ్మెల్సీ స్థానం పై పట్టభద్రులు ఏ జెండా ఎగురవేసి.. ఎవరి పక్షాన నిలుస్తారో చూడాలి మరి.