28.7 C
Hyderabad
Saturday, April 13, 2024
spot_img

తెలంగాణలో మండుతున్న నీళ్ల రాజకీయం

   తెలంగాణలో నీటి కష్టాలు కలవరపెడుతున్నాయి. తాగు, సాగు నీరు ఇబ్బందులు రేవంత్‌ సర్కార్‌కు సంకటంగా మారాయి. పంటలు ఎండిపోయి రైతులు లబోదిబోమంటుంటే వారికి అండగా మేమున్నాంటూ బీఆర్‌ఎస్‌ పోరు బాట పట్టింది. కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్‌ తెచ్చిన కరువంటూ గులాబీ నేతలు విమర్శలు చేస్తుంటే.. వారికి కౌంటర్‌ ఎటాక్‌ చేస్తున్నారు హస్తం నేతలు. దీంతో తెలంగాణ రాజకీయమంతా నీళ్ల చుట్టే తిరుగుతోంది. ఇంతకీ వాతావరణ పరిస్థితులే నీటి కటకటకు కారణమా..? లేక బీఆర్‌ఎస్‌ చెబుతున్నట్టు ఇది కాంగ్రెస్‌ తెచ్చిన కరువా..? లేదంటే హస్తం నేతలు ఆరోపిస్తున్నట్టు గత కేసీఆర్‌ సర్కార్‌ వైఫల్యాలా..?

తెలంగాణలో నీటి కష్టాలతో జనం అల్లాడుతున్నారు. ఓ వైపు తాగునీటికి అవస్థలు పడుతుంటే,.. మరోపక్క సాగునీరు లేక పంటలు ఎండిపోయి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అయితే,.. ఈ పరిస్థితుల్లో తాగునీటి అవసరాలకే అధిక ప్రాధాన్యతనిస్తోంది కాంగ్రెస్‌ సర్కార్‌. అత్యవసరమైతే తప్ప సాగునీటిని విడుదల చేయడం లేదు. దీంతో పంటలు ఎండిపోయే దుస్థితి ఏర్పడింది. అయితే,.. ఈ పరిస్థితులను బీఆర్‌ఎస్‌ క్యాచ్‌ చేసుకుంది. రైతులకు అండగా పోరుబాట పట్టింది. ఈ క్రమంలోనే ఇటీవలే మాజీ సీఎం కేసీఆర్‌ పలు జిల్లాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పంటల పరిస్థితులను పరిశీలిం చారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ సర్కార్‌ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు కేసీఆర్‌. పదేళ్లపాటు పచ్చగా ఉన్న తెలంగాణలో రైతు ఆత్మహత్యలు మొదల య్యాయని ధ్వజమెత్తారు. అలాగే మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ల మీదు కాదు.. ట్యాప్‌ల మీద దృష్టి సారించండి అంటూ మండిపడ్డారు కేటీఆర్‌. మేడిగడ్డను బూచిగా చూపి.. కాళేశ్వరం జలాలను ఆపడంతోనే ఎక్కడికక్కడ నీటి కష్టాలు మొదలయ్యాయని ఆరోపించారు. తమపై బురదజల్లేందుకు చేసే కుట్రలో భాగంగానే రైతులను ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక బీఆర్‌ఎస్‌ చేస్తున్న విమర్శలకు కౌంటర్‌ ఇచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని విమర్శలు గుప్పించారు. వర్షాకాలం, చలికాలం ఎప్పుడొస్తుందో కూడా ఆ పార్టీ నేతలకు తెలియడం లేదని, పదేళ్ల తర్వాతయినా వారికి రైతులు, వ్యవసాయం గుర్తొచ్చినందుకు సంతోషంగా ఉందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అలాగే కేసీఆర్‌ వ్యాఖ్యానించిన రైతు ఆత్మహత్య లపై స్పందించిన ఆయన.. ఆ వివరాలు ఇస్తే నష్టపరిహారం అందజేస్తామన్నారు.ఇకపోతే నీటి ఎద్దడితో తెలంగాణ వాసులు అల్లాడిపోతున్నారు. చాలా ప్రాంతాల్లో పంటలు ఎండిపోయి రైతులు దిక్కుతోచని పరిస్థితిలో తలల పట్టుకుంటున్నారు. ఒక్క తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా నీటి కరువుతో జనం నానా అవస్థలు పడుతున్నారు. తెలంగాణ‌తో స‌హ మేజారిటి రాష్ట్రాల్లో నీటి స‌మస్య తలెత్తింది. మ‌రీ ముఖ్యంగా ద‌క్షిణ భార‌త రాష్ట్రంలో నీటి ఎద్దడి అధికంగా క‌నిపిస్తుంది. రిజ‌ర్వాయ‌ర్లలో కేవ‌లం 22 శాత‌మే నీటి ల‌భ్యత ఉంది. సాధ‌ర‌ణం క‌న్నా త‌క్కువ వ‌ర్షాపాతం న‌మోదు కావ‌డం, భూ గ‌ర్భజ‌లాలు అడుగంట‌డంతో ఈ పరిస్థితులు తలెత్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

గ‌త ఏడాది స‌రైన వ‌ర్షపాతం న‌మోదు కాక‌పోవ‌డం వ‌ల్ల ప్రాజెక్టులు అడిగంటిపోయాయి. చాలా జిల్లాల్లో పంటలు ఎండి పోయే ప‌రిస్థితితో రైతులు బోర్లు వేస్తున్నారు. అయితే,.. భూగర్భజలాలు తగ్గడంతో ఎన్ని బోర్లు వేస్తున్నా నీళ్లు పడటం లేదు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో ప్రాజెక్టుల్లో ఉన్న కాస్త నీరు పంటలకు వినియోగిస్తే.. తాగు నీటికి కష్టమవుతుందని ఆచి తూచి వ్యవహరిస్తోంది రేవంత్‌ ప్రభుత్వం. తాగునీటి అవసరాలకే మొదటి ప్రధాన్యతనిస్తోంది. నాగార్జున సాగర్‌ అడుగు నుంచి నీటిని పంప్ చేసేందుకు ప్రత్యేకంగా పైప్ లైన్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక జంట న‌గ‌రాల దాహార్తిని తీర్చేందుకు ఉస్మాన్ సాగ‌ర్, గండిపేట నుంచి అధిక మొత్తంలో నీటిని వినియోగిస్తున్నారు. గ‌తంలో హైద‌రాబాద్ అవ‌స‌రాల కోసం వినియోగించే కృష్ణా, గోదావ‌రి జ‌లాల‌ను సాగునీటి కోసం వినియోగిస్తోంది. అలాగే కాళేశ్వరం గాయత్రి పంప్‌ హౌస్‌ నుంచి 4500 క్యూసెక్కులు, మ‌ల్లన్న సాగ‌ర్ నుంచి 800 క్యూసెక్కుల నీటిని విడ‌ద‌ల చేసి పంట‌ల‌ను కాపాడే ప్రయ‌త్నం చేస్తుంది. కాంగ్రెస్‌తో కరువు రావడం యాధృశ్చికమేనని ప్రభుత్వం పట్ల కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఒక‌టి చేసి త‌మ పంటలు కాపాడాల‌ని కోరుతున్నారు. తక్షణమే రైతులను రేవంత్‌ సర్కార్‌ పట్టించుకోకపోతే,… ఇదే పరిస్థితి కొనసాగితే పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కష్టాలు తప్పవంటున్నాయి రాజకీయ వర్గాలు.

Latest Articles

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎన్డీయే కూటమి వ్యూహాలు

       ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ప్రకటించేశాయి. ఇక ప్రచా రంలోనూ దూకుడుగా వెళ్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎన్డీయే కూటమి వ్యూహాలు రచి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్