ఆంధ్ర రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న ఒంగోలు నియోజకవర్గం అన్నీ కుదరితే రాష్ట్ర రాజధాని అయ్యేది. రాజకీయ పార్టీల స్వప్రయోజనాలకు బలైపోయింది. 2014లో సీఎంగా జగన్మోహనరెడ్డి వచ్చి ఉంటే రాజధాని గొడవ ఉండేది కాదని అంటున్నారు. ఆయన బీజేపీ కంట్రోల్ లోనే ఉంటారు కాబట్టి, శ్రీ క్రష్ణ కమిటీ చెప్పినట్టు ఒంగులు లోనే రాజధాని పెట్టేసే వారు. ఎందుకంటే వాన్ పిక్ భూములను సేకరిం చింది, తన తండ్రి వైఎస్సార్ కాబట్టి, ఆ పేరు కోసమైనా ఇటువచ్చే వారని ప్రకాశం జిల్లా వాసులు ఇప్పటికి గగ్గోలు పెడుతుంటారు. ఎన్నో ప్రత్యేకతలుండి, అన్నిరకాలుగా వెనుకపడింది ఒంగోలు నియోజకవర్గం.
ఒంగోలు నియోజకవర్గానికి దగ్గరలో తీర ప్రాంతం ఉంది. చెన్నై, కోల్ కతా ప్రధాన రైలు మార్గాలు న్నాయి. సూపర్ ఫాస్ట్ రైళ్లు ఆగుతాయి. రవాణా వ్యవస్థకు కేంద్ర బిందువుగా ఉంది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒంగోలు గిత్తలున్నాయి. రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా ఒంగోలు అయితే బాగుంటుందని శ్రీక్రష్ణకమిటీ చెప్పింది. రాజధాని నిర్మా ణానికి అవసరమైన ప్రభుత్వ వాన్ పిక్ భూములు కూడా ఉన్నాయి. అంతే కాదు రాష్ట్రానికి సరిగ్గా సెంటర్ పాయింట్ లో ఉందని నివేదిక ఇచ్చింది. ఇలా అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఇక్కడ పరిస్థితులు మారాయి. పేరులోనే ప్రకాశం, జిల్లాలో లేదని అనడం వెనుక కారణాలేమిటి? అంటే ఎన్నో ఉన్నాయి. ఒంగోలు నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇప్పటివరకు ఉప ఎన్నికలతో కలిపి 17 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 7 సార్లు, తెలుగు దేశం 4 సార్లు, ఉప ఎన్నికతో కలిపి వైసీపీ రెండు సార్లు, కమ్యూనిస్టులు ఒకసారి, ఇండిపెండెంట్లు మూడుసార్లు విజయం సాధించారు. ఒంగోలు కేంద్రంగానే నడిచే జిల్లా రాజకీయాలు నడుస్తుంటాయి. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్నిటికి ఒంగోలు పట్టణమే కేంద్రబిందువుగా ఉంటుంది.
ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇక్కడ నుంచి 5 సార్లు విజయం సాధించారు. ఒకనాటి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు పనిచేశారు. ఆయన తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న నాయ కులు లేరనే చెప్పాలి. అందుకే ప్రకాశం జిల్లాగా నామకరణం చేశారు. తర్వాత కాలంలో కొందరు మాత్రం మంత్రివర్గంలో కీలకశాఖలు నిర్వహించారు. వంగవోలు రాజులు పరిపాలించడంతో కాలక్రమంలో వంగవోలు కాస్తా ఒంగోలుగా మారి పోయింది. 1972 లో గుంటూరు, నెల్లూరు కర్నూలు జిల్లాల నుండి ప్రకాశం జిల్లా విడివడింది. మండలాలను చూస్తే …ఒంగోలు, కొత్త పట్నం మండలాలతో పాటు కొత్తగా ఏర్పడిన ఒంగోలు రూరల్ మండలాలు ఉన్నాయి. ఇక చెన్నై- కోల్ కత్తా జాతీయరహదారిపై గుంటూరు, నెల్లూరు జిల్లాల మధ్యలో ఒంగోలు పట్టణం తగులుతుంది.
ఒంగోలు నియోజకవర్గంలో 2 లక్షల 36 వేల 292 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషుల సంఖ్య 1లక్షా 13 వేల 702 మంది అయితే, మహిళలు 1 లక్షా 22 వేల 549 మంది ఉన్నారు. ట్రాన్స్‌జండర్స్ 41 మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జనాభా పరంగా చూస్తే ప్రకాశం జిల్లా 13వ స్థానంలో ఉంది.ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఒంగోలు గిత్తలు ఇక్కడే ఉన్నా యి. ఇవి ప్రత్యేకమైన జేబూ జాతికి చెందినవి. కాకపోతే మన దగ్గర తరిగిపోతున్నాయి. బ్రెజిల్ దేశంలో వెలిగిపోతు న్నాయి. దాని వెనుక ఒక వాస్తవ కథ ఉంది. అది 1868 వ సంవత్సరం. భారతదేశం నుంచి ఇంగ్లండ్‌కు ఒక ఓడ బయలుదేరింది. అందులో విక్టోరియా మహారాణి కోసం పంపిస్తున్న కొన్ని విలువైన బహుమతులున్నాయి. అయితే అనుకోకుండా ఆ ఓడ బ్రెజిల్ తీరానికి చేరుకుంది. విక్టోరియా మహారాణి కోసం పంపిన బహుమతులను అక్కడ అమ్మేశారు. ఆ బహుమతులే.. రెండు ఒంగోలు జాతి పశువులు. ఆ విధంగా బ్రెజిల్ గడ్డపై ఒంగోలు జాతి ప్రస్థానం ప్రారంభమైంది. రెండింటితో మొదలై ఇప్పుడు కొన్ని కోట్లకు చేరుకుంది. వాళ్లు కాపాడుకుంటు న్నారు. మనం భారాన్ని మోయలేకపోతున్నాం. బ్రెజిల్ లో దాదాపు 43 కోట్ల ఎకరాల గడ్డి భూములున్నా యి. అంటే సగటున ఒక్కో ఒంగోలుగిత్తకు సుమారు రెండెకరాల భూమి ఉంది. అందువల్ల పోషణ సులువు అయ్యింది. ఇక అక్కడ నుంచి ఒంగోలు గిత్తలు ప్రపంచమంతా విస్తరించాయి. అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, మెక్సికో, ఇండోనేసియా, మారిషస్, కొలంబియా, మలేసియా ఇలా పలుదేశాలకు ఒంగోలు జాతి విస్తరించింది.
ఒంగోలు పరిధిలో 4 వేల కేంద్రాల్లో సాగయ్యే మేలుజాతి వర్జీనియా పొగాకు సాగు చేస్తారు. దేశ విదేశాలకు ఇక్కడ నుంచి ఎగుమతులు జరుగుతుంటాయి. కందుకూరు-1, కందుకూరు-2, కలిగిరి, డీసీపల్లి, ఒంగోలు-1, ఒంగోలు-2, పొదిలి, కనిగిరి, కొండెపి, వెల్లంపల్లి, టంగుటూరుతో వేలం కేంద్రాల పరిధిలో 2022-23 సీజన్ లో పొగాకు బోర్డు 89.35 మిలియన్ కిలోల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్ణయించారు. రైతులు మాత్రం 122.34 మిలియన్ కిలోలను పండించారు. అధికంగా పండించిన పొగాకు వేలం కేంద్రాల్లో అమ్ముకోవాలంటే 5 శాతం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ చొరవతో నష్టం లేకుండా అమ్ముకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. అంతర్జాతీయ విపణిలో పొగాకు రేట్లు స్థిరంగా ఉండవని, రైతులు వేలం వెర్రిగా వేయవద్దని ట్రేడింగ్ విశ్లేషకులు చెబుతుంటారు.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన “గెలాక్సీ గ్రానైట్” ఒంగోలు గనుల్లోనే లభ్యమవుతుంది. చీమకుర్తి, ఆర్‌ఎల్‌పురం, బూద వాడ, దేవరపాలెం గ్రామాల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గెలాక్సీ గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయి. ప్రస్తుతం బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ కోసం మొత్తం 452.784 హెక్టార్ల విస్తీర్ణంలో 135 క్వారీ లీజులు ఉన్నాయి. దాదాపు 10 వేల మందికి ప్రత్యక్షంగా, 25 వేల మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతోంది. భద్రతా ప్రమాణాలు లేక గ్రానైట్ గనుల్లో కార్మికుల కష్టాలు పడుతున్నారు. ప్రాణాలు కోల్పోవడమో లేదంటే గాయాల పాలు కావడం, జరుగుతుంటుంది. అధికారులు వచ్చి ఉపన్యాసాలు దంచి వెళ్లిపోతారు గానీ, వారికి చేసింది శూన్యమని అందరూ అంటారు. ఎన్నికలు రాగానే అరచేతిలో వైకుంఠం చూపించి, ఓట్లు వేయించుకుని మళ్లీ కనిపించరని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భరద్వాజ మహర్షి వేద విద్యా మండలి ఉంది. దీనిని అలూరి సీతారామమ్మ-రామకోటేశ్వరరావు పాఠశాలగా కూడా పిలుస్తారు. ఉన్నత విద్యాలయాలతో సరస్వతీ నిలయంగా ఒంగోలు పట్టణం పేరు ప్రఖ్యాతులు పొందింది. ఇక్కడ వేదవిద్యను నేర్పిస్తారు. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, QIS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ, పేస్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ, దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వంటి కళాశాలలు ఒంగోలులో వున్నాయి. శర్మ కాలేజి ఇక్కడ పేరు ప్రఖ్యాతులున్నాయి.హీరో చిరంజీవి, దర్శకుడు టి. క్రష్ణ, నవతరం బాబూరావు, ఎంవీఎస్ హరనాథరావు, ముత్యాల సుబ్బయ్య తదితర సినీ ప్రముఖులు ఇక్కడ శర్మ కాలేజీలో చదువుకున్నవారే. వీరిలో పలువురు ప్రజా నాట్యమండలి నుంచి వచ్చి సినీ పరిశ్రమలో నిలదొక్కు కున్నారు. అందుకే అందరిలో విప్లవభావాలు ఎక్కువగా ఉంటాయి. వీరికన్నా ముందు సినిమా ఇండస్ట్రీకి వచ్చినవారి లో హీరోయిన్ కాంచన, అలనాటి ప్రముఖ నటి భానుమతి, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కొంగర జగ్గయ్య, జి. వరలక్ష్మి లాంటివారు ప్రకాశం జిల్లా వాసులు కావడం విశేషం. ప్రతి ఏడాది ఎన్టీఆర్ కళాపరిషత్, ఒంగోలు ఆధ్వర్యంలో ప్రతి ఏటా రాష్ట్ర వ్యాప్త నాటకోత్సవాలు ఘనంగా జరుగుతాయి.
2014లో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యరూపం దాల్చలేదు. పర్యాటకంగా కొత్తపట్నం బీచ్ అభివృద్ధికి నోచుకోలేదు. కొత్తపట్నం, ఈతమొక్కల ప్రాంతాలలో ఆహ్లాదకరమైన తీర ప్రాంతం ఉంది. సెలవురోజుల్లో అక్కడ బీచ్ లు పర్యాటకుల తో కళకళలాడుతూ ఉంటాయి. పర్యాటకంగా అభివ్రద్ధి చేయాలనే డిమాండ్లు ఉన్నా గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరూ పట్టించుకోలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ఒంగోలు నగరంలో పురాతన ప్రసిద్ది చెందిన చెన్నకేశవుల ఆలయం, ఇంకా ఒంగోలు కొండపై శ్రీ గిరి పుణ్యక్షత్రం ఉంది. వీటితో పాటు సాయిబాబా దేవాలయం ఉంది. ఇంకా బ్రిటిష్ కాలం నుంచి ఉన్న చర్చి ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా చెప్పాలి. 1902 నుంచి దీపావళికి ముందు జరిగే నరకాసుర వధను ఇక్కడ ఘనంగా చేస్తారు. 2019 ఎన్నికల్లో వైసీపీ కి చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి 22,245 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బాలినేని కి 1 లక్షా 01 వేల 022 ఓట్లు రాగా సమీప తెలుగుదేశం అభ్యర్ధి దామచర్ల జనార్ధన్‌కి 78 వేల 777 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేసిన షేక్ రియాజ్ కు 10 వేల 304 ఓట్లు, నోటాకు పదమూడు వందల ముపై మూడు ఓట్లు వచ్చాయి. మరి వచ్చే ఎన్నికల్లో జనసేన కలిసినా తెలుగుదేశానికి లీడ్ రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బాలినేని మీద వ్యతిరేకత ఉందనే ప్రచారం సాగుతున్నా, జగనన్న సంక్షేమ పథకాలు ఒడ్డున పడేస్తాయని అంటున్నారు.


