స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కొత్త సచివాలయం దగ్గరికి వెళ్తుండగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని లక్డీకపూల్ లోని టెలిఫోన్ భవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అయితే సచివాలయంలోకి వెళ్లడానికి అనుమతి లేదని చెప్పడంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లలో భారీ అవినీతి జరిగిందని.. దీనిపై ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేసేందుకు సచివాలయం వెళ్తున్నానని తెలిపారు. కానీ పర్మిషన్ లేదనడంతో ఎంపీని అయినా తనను ఎలా అడ్డుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు సచివాలయానికి వెళ్తుంటే అడ్డుకోవడం ఏమిటని నిలదీశారు. తనకు అనుమతి ఇచ్చేదాకా ఇక్కడే ఉంటానని లేదంటే రోడ్డుపై కూర్చుంటానని తెలిపారు. మరోవైపు సెక్రటేరియట్ విజిటర్స్ ఎంట్రీ గేటు మూసివేసిన పోలీసులు అక్కడ బారికేడ్లను ఏర్పాటుచేశారు. దీంతో సచివాలయం పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది.