స్వతంత్ర, వెబ్ డెస్క్: జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తలపెట్టిన వారాహి యాత్రకు ఎట్టకేలకు పోలీసుల నుంచి అనుమతి లభించింది. చట్టప్రకారం ఎవరైనా పర్యటనలు చేయవచ్చని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. భద్రత కారణాల దృష్ట్యా కేవలం మినిట్ టు మినిట్ షెడ్యూల్ మాత్రమే అడిగామన్నారు. జనసైనికులు ఎలాంటి గందరగోళం చేయకుండా సజావుగా యాత్ర జరుపుకోవాలని సూచించారు. తొలి విడతలో భాగంగా జూన్ 14(రేపు)న అన్నవరం దేవస్థానం నుంచి యాత్ర మొదలై భీమవరం వరకు జరగనుంది.
ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం, నరసాపురం నియోజకవర్గాల్లో యాత్రకు జనసేన నేతలు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. అనంతరం ఈనెల 21న అమలాపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే మరోవైపు పోలీసుల పర్మిషన్ ఇచ్చినా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాత్రం ఈ నెలాఖరు వరకు అమలాపురం, కొత్తపేట డివిజన్‌లో సెక్షన్ 30 యాక్ట్ అమలు చేయనున్నారు. దీంతో ఎన్ని అడ్డంకులు సృష్టించినా కోనసీమలో వారాహి యాత్ర చేసి తీరుతామని జనసైనికులు స్పష్టం చేస్తున్నారు.