51 రోజులు|రోజుకి రూ. 25,000
రెండు దేశాల మధ్య 27 నదుల వెంట సాగే జల విహారం
రూ.12.59 లక్షల ప్యాకేజీతో ‘గంగా విలాస్’ పై ప్రయాణం|
ప్రపంచంలోని అత్యంత దూరం ప్రయాణించే పాసింజర్స్ షిప్
ఎన్నాళ్ల నుంచో భారతీయులు ఎదురుచూస్తున్న నదీజలాలపై నౌకా ప్రయాణం అందరి ముందుకి వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత దూరం నీటిపై ప్రయాణించే క్రూయిజ్ షిప్ ఎంవీ గంగా విలాస్ మన ముంగిట నిలిచింది. పీఎం మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. వారణాసిలో జరిగిన కార్యక్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ , కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ హాజరయ్యారు.
భారతదేశంలో పాసింజర్ షిప్స్ తక్కువే అని చెప్పాలి. ఉన్నా వాటికంత ప్రాముఖ్యత కూడా లేదు. ఇటీవల విశాఖపట్నంలో ఒకటి ప్రారంభించినా అదెంత వరకు విజయవంతమైందో కూడా తెలీదు. ఈ దశలో భారతదేశంలో ఉన్న సజీవ నదీజలాలపై టూరిజాన్ని ప్రోత్సహించాలనే బృహత్ సంకల్పంతో ప్రధాని మోదీ ఆలోచించి తీసుకున్న నిర్ణయమే…‘గంగా విలాస్’ నౌకా ప్రయాణం.
‘గంగా విలాస్’ నౌకపై సాగే ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే భారతదేశం, బంగ్లాదేశ్… రెండు దేశాల మధ్య 3,200 కిమీ దూరం, 27 నదుల వెంట సాగుతూ…51 రోజులు సాగే ప్రయాణం ఇది… ఈ ప్రయాణం ఊహించడానికే ఎంతో థ్రిల్లింగ్ గా ఉందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. కచ్చితంగా ఇది అందరినీ ఆనందడోలికల్లో తేలియాడేలా చేస్తోందని అంటున్నారు. ఒక మనిషికి రూ.12.57 లక్షలుగా టికెట్టు నిర్ణయించడంతో కొందరి గుండెలు గతుక్కుమన్నాయి. అయితే రాబోవు రోజుల్లో తక్కువ దూరం, తక్కువ రోజులు, తక్కువ ధరతో అవకాశం ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
గంగా విలాస్ నౌక లోపలంతా భారతీయ సంప్రదాయాలు ఉట్టిపడేలా శోభాయమానంగా అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు. 62 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు ఉండే ఈ భారీ క్రూజ్ లో 18 సూట్లు ఉన్నాయి. 36 మంది ప్రయాణీకులు ప్రయాణించవచ్చు. మూడు సన్ డెక్ లు, ఒక జిమ్ సెంటర్, ‘స్పా’ సదుపాయం కూడా ఉంది. నదీ వ్యూ కనిపించేలా ఏర్పాటు చేసిన అద్దాల మధ్య ప్రకృతి సౌందర్యాన్ని తిలకించవచ్చు.
భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్, బీహార్, అసోం, బంగాల్ తో పాటు బంగ్లాదేశ్ లోని నదుల వెంట కూడా ఈ నౌక ప్రయాణించనుంది. ప్రధాన నదులైన గంగా, బ్రహ్మపుత్ర, భాగీరథి, హుగ్లీ, బిద్యావతి, మాట్లా, బంగ్లాదేశ్ లోని మేఘన, పద్మ, జమున నదుల్లో విహరిస్తుంది.
ఇక్కడ విచిత్రం ఏమిటంటే మన దేశంలోని పేర్లే వెరైటీగా ఉంటే బంగ్లాదేశ్ లో నదుల పేర్లు భారతీయ సంప్రదాయాలకు విలువనిచ్చేవిగా ఉండటం ఇక్కడ చెప్పుకోతగిన విషయం. ఈ యాత్ర వారణాసిలో ప్రారంభమై అసోంలోని దిబ్రుగఢ్ లో ముగుస్తుంది.
మొత్తం 51 రోజుల సుదూర పర్యటనలో నదీ తీర ప్రాంతాల్లో కొలువైన 50 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఆగుతుంది. రొజుకొక పుణ్యక్షేత్రంలో ఆగుతుంది. అక్కడ నీటి మీద నుంచి నేల మీదకు దిగి, ఆ దేవాలయాన్ని సందర్శించుకుని, మళ్లీ బోట్ పైకి చేరుకుని ప్రయాణం సాగించవచ్చునన్నమాట. అలా ఈ టూర్ ని డిజైన్ చేశారు.
రోజుల తరబడి నదిపై ప్రయాణించాలనే టెన్షను ఉండదు. ఏరోజుకా రోజు ఒడ్డుకు చేరుతాం. హాయిగా నేలపై గాలిని పీల్చుకుని, మళ్లీ నది విహారం వైపు సాగిపోతాం. తలచుకుంటేనే వళ్లు పులకరిస్తుందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. జీవితంలో ఒక్కసారైనా గంగావిలాస్ ఎక్కాలని పలువురు చెప్పడం విశేషం. ఈ క్రూయిజ్ బోట్ కి ఉన్న స్పందన చూసి మరిన్ని వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. అంతేకాదు ఆధ్యాత్మిక యాత్రలే కాదు, విహార యాత్రలు, వినోద యాత్రలు కూడా మొదలవుతాయని కూడా చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం పదండి మరి గంగా విలాస్ దగ్గరికి అని మరికొందరు వ్యాక్యానిస్తున్నారు.