యువతకు దగ్గరయ్యేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో సమ్మేళనాలు నిర్వహించాలని గులాబీ పార్టీ భావిస్తోంది. యువతకు దగ్గర కావడంతో పాటు గతంలో తాము ప్రవేశ పెట్టిన పధకాలను వివరించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. మరోవైపు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండ గట్టి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలని బీఆర్ఎస్ ఆలోచనలు సాగిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా బీఆర్ఎస్ జాగ్రత్తలు తీసుకుంటోంది.
లోక్ సభ ఎన్నికల్లో యువతను ఆకర్షించే విధంగా బిఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది.ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో విద్యార్థి, యువత సమ్మేళనాలకు సన్నద్ధమైంది. ఇందులో యువత అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు పార్టీ నుంచి ఆశిస్తున్న అంశాలను బీఆర్ఎస్ నేతలు తెలుసుకోనున్నారు. బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో విద్యార్థులకు, యువ తకు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు వివరించనున్నా రు. విద్యారంగంలో సంస్కరణలు తెచ్చిన విషయాలు, యువత కు ఉపాధి అవకాశాలు కల్పించిన విషయాలను గుర్తుచేయనున్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపైనా విమర్శలు గుప్పించడానికి బీఆర్ఎస్ నేతలు సిద్ధం అవుతున్నారు. రుణమాఫీ, రైతు భరోసా,మహాలక్ష్మీ, స్కూటీ పధకం లాంటి అంశాలపై ఎక్కడికక్కడ నిలదీయాలని యువతకు పిలుపు నివ్వనున్నట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. సాగు, తాగునీటి కొరతతోపాటు కరెంటు సమస్యలు, ప్రభుత్వ, ప్రైవేటురంగంలో ఉపాధి అవకాశాలు ప్రత్యేకం గా ప్రస్తావించి యువతను ఆకట్టుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓటర్ల లిస్టును బీఆర్ఎస్ సేకరించింది. అందులో యువత ఓటర్లు గ్రామాల వారీగా ఎంతమంది ఉన్నారనే వివరాలను ఆరా తీస్తున్నారు.ప్రతి ఓటర్ కు బీఆర్ఎస్ సంక్షేమాన్ని ఫోన్,మెసేజ్ రూపంలో వివరించనున్నారు. అదే విధంగా పార్టీ గ్రామకమిటీలు సైతం యువతతో భేటీ కావాలని సూచనలు చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కు ఓటువేయాలని ప్రత్యేకంగా కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లందరికీ మెసేజ్ లు పంపనున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రచారాన్ని విస్తృతం చేస్తే త్వరగా రీచ్ అవుతుందని,అందుకు ప్రత్యేక టీములను ఏర్పాటు చేస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు, పార్లమెంట్ ఎన్నికల్లో జరగకుండా పార్టీ అధిష్ఠానం పక్కా ప్రణాళికలను రూపొందిస్తోంది. యువతకు దగ్గరయ్యేందుకు సమ్మేళనాలను వేదికగా మలుచుకోవాలని భావిస్తుంది. వారి ఓట్లతో పాటు వారి కుటుంబ సభ్యుల ఓట్లు కూడా గంపగత్తుగా పడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.పార్లమెంట్ నియోజకవ ర్గంలో చేపట్టబోయే కార్యక్రమాలు,స్థానిక సమస్యలపైనా హామీలు ఇస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వున్నచోట్ల పూర్తి బాధ్యతలను వారికి అప్పగిస్తున్నారు.యువత చూపు బీజేపీ వైపు ఉందని భావిస్తున్న బీఆర్ఎస్, ఆ మేరకు నష్టం కలగకుండా ప్రయత్నాలు సాగిస్తోంది. కేంద్రంలో బీజేపీ పదేళ్ల పాలనలో విభజన అంశాలు, రాష్ట్రానికి రావల్సిన కేంద్రం నిధులతో పాటు ప్రాజెక్టులకు ఒక్క రూపాయి ఇవ్వలేదని దీంతో సాధించాలనుకున్న అభివృద్ధి లక్ష్యాన్ని చేరుకోలేకపో యామని యువతకు విస్తృతంగా సమ్మేళనంలో వివరించాలని భావిస్తుంది. అదే విధంగా యువతకు బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలు, చేసిన ప్రకటనలు సమ్మేళనంలో ఎల్ఈడీ స్క్రిన్లతో వివరించేం దుకు గులాబీ పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే మెదక్ పార్లమెంట్ పరిధిలో యువతతో పార్టీ పెద్దలు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలోను యువతతో ప్రత్యేకంగా సమావే శాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో యువతను ఆకర్షించేందుకు బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి…


