తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు కుటుంబ సభ్యులకు స్థలం క్రమబద్ధీకరణపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బంజారాహిల్స్‌లోని NBT నగర్‌లో ఉన్న భూమిని తక్కువ ధరకు జీవో నెం.56 ద్వారా కేటాయించారని రఘువీర్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రెవెన్యూ అధికారులతో పాటు గద్వాల విజయలక్ష్మి, జీపీఏ హోల్డర్ కవితను ప్రతివాదులుగా చేర్చారు. స్థలం కేటాయిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ చేపట్టింది. కౌంటరు దాఖలు చేయడానికి ప్రతివాదుల తరఫు న్యాయవాదులు సమయం కోరారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు వచ్చే నెల 27కి వాయిదా వేసింది.
రూ.5.5 లక్షలకు రూ.30 కోట్ల విలువైన భూమి
గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల అండదండలతో కే. కేశవరావు కుటుంబ సభ్యులు తాము ఆక్రమించుకున్న రూ.30 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కేవలం రూ.5.5 లక్షలకు క్రమబద్ధీకరించుకున్నారు. గత ప్రభుత్వం 59 జీవోను తుంగలో తొక్కి 1,586 గజాలను నామమాత్రపు ధరకు క్రమబద్ధీకరించి, రిజిస్ట్రేషన్ చేసింది. అందులో 425 గజాలు కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి పేరిట రిజిస్ట్రేషన్ కాగా, మరో 1161 గజాలు ఆయన కుమారుడి పేరిట రిజిస్టర్ అయ్యాయి. ప్రభుత్వ రికార్డుల్లో భూమి ధర ప్రకారం చెల్లించినా వీళ్లు రూ.10 కోట్లు చెల్లించాల్సి వచ్చేది. కానీ కూతురు, కొడుకు కలిసి చెల్లించింది కేవలం రూ.5.5 లక్షలు మాత్రమే.
బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12కు వెనుక ఉండే NBT నగర్‌లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కేకే, ఆయన కుటుంబ సభ్యులు కలిసి సుమారు 2,500 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్నారు. అందులో కొంత స్థలంలో ఇల్లు కట్టుకున్నారు. మిగతా 1,586 గజాల్లో.. కూతురు విజయలక్ష్మికి 425 గజాలు, కుమారుడికి 1,161 గజాలు పంచి ఇచ్చారు. వాళ్లు కూడా ఆ స్థలాల్లో కొంతవరకు ఇళ్లు కట్టుకొని, మరికొంత ఖాళీగా ఉంచుకున్నారు. ఆక్రమించిన ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరించుకొని, రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అప్పటి ప్రభుత్వం అవకాశం కల్పించడంతో కేకే కుమార్తె, కుమారుడు దరఖాస్తు చేసుకున్నారు. నామ మాత్రపు డబ్బులు చెల్లించి ప్రభుత్వ స్థలాన్ని తమ పేరిట రిజిస్ట్రర్ చేయించుకున్నారు.