స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలో కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని మంత్రి కేటీఆర్ అన్నారు. మూడోసారి గెలిచి దక్షిణ భారత దేశంలో హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. జీవో నెం.118 కింద రెగ్యులరైజ్ చేసిన పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్నెల్ల పాటు రాజకీయాలు చేస్తే చాలని.. మిగతా నాలుగున్నరేండ్ల పాటు అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు ఏం చేయాలనే దానిపైనే దృష్టి పెట్టాలని అన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని, పనికొచ్చే ప్రభుత్వాన్ని ప్రజలు వదులుకోరని మంత్రి కేటీఆర్ అన్నారు. వాళ్లు తిరిగి గెలిపించుకుంటారనే విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ఆ నమ్మకంతోనే 415 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించామని చెప్పుకొచ్చారు. 24 గంటలూ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని సలహానిచ్చారు.
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడని పెద్దలు అంటుంటారు. ఇల్లు కట్టడం ఎంత కష్టమో.. పెళ్లి చేయడం కూడా అంతే కష్టమనే భావనలో ఈ మాట అంటుంటారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లు మేమే కట్టిస్తున్నాం.. పెళ్లి మేమే చేస్తున్నాం.’ అని మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలో డబుల్ బెడ్రూం ఇండ్లు లక్ష పూర్తయినయి. ఈ ఇండ్లను ఆగస్టు 15 నుంచి అక్టోబరులోగా పంపిణీ చేయబోతున్నామని ప్రకటించారు.
ఇప్పటికే ఇండ్లు పూర్తయినయని.. అలాట్‌మెంట్ చేసుకుని.. నియోజకవర్గానికి 4వేల చొప్పున ఇండ్లు ఇవ్వబోతున్నామని తెలిపారు. గృహలక్ష్మీ పథకం కింద నియోజకవర్గానికి మూడు వేల కుటుంబాలకు ఇవ్వబోతున్నాని చెప్పారు. ఒక్క ఎల్బీనగర్ నియోజకవర్గంలోనే డబుల్ బెడ్రూం ఇండ్లు 4 వేలు, గృహలక్ష్మీ పథకం కింద 3వేలు వస్తాయని అన్నారు. జీవో నెం.58, 59 కింద 11వేలు వచ్చాయని, జీవో నెం.118 కింద 18 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరిందన్నారు. అంటే ఒక్క నియోజకవర్గంలోనే 40 వేల పైచిలుకు కుటుంబాలకు సొంతింటి కల నెరవేరిందని వివరించారు.