స్వతంత్ర, వెబ్ డెస్క్: కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడమే మానవత్వం అంటారు. ఆపదలో ఉన్నవారికి సాయం చేయడమే మంచితనం అంటారు. ఇందుకు నిదర్శనంగా ఒడిశా ప్రజలు నిలుస్తున్నారు. ఒకరు కాదు వందలు కాదు వేలమంది ముందుకొచ్చారు. ఘెర రైలు ప్రమాదం జరిగి వందలాది మంది దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటే వారిని ఆదుకోవడం కోసం మేమున్నాం అంటూ భరోసా ఇస్తున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారికి రక్తదానం చేస్తామంటూ బారులు తీరారు. బాలాసోర్ పరిసర ప్రాంతాల ప్రజలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో పాటు వారి బంధువులకు కూడా సేవలందిస్తున్నారు.
దాదాపు వేల మంది స్థానికులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి బాలాసోర్ మెడికల్ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆపదలో ఉన్న వారి కోసం స్వచ్ఛందంగా రక్తదానం చేసినవారందరికీ ప్రయాణికులతో పాటు అధికారులు ధన్యవాదాలు తెలిపారు. రక్తదానం చేయడం కోసం వేలాది మంది బారులు తీరిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 290కి చేరిందని, గాయపడినవారి సంఖ్య 1,000 దాటిందని తెలుస్తోంది.