స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలో మొట్టమొదటిసారిగా మత్యకార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని 7,200 మంది మత్స్యకారులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి గుర్తింపు కార్డులను పంపిణీ చేసి మంత్రి మాట్లాడారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా 2 వేల కోట్ల రూపాయలతో మత్స్యకారుల సంక్షేమానికి ఖర్చు చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పారు.
కాంగ్రెస్ హయాంలో కొన్ని చెరువులలో సబ్సిడీపై చేప పిల్లలు వేసేవారని, నేడు రాష్ట్రంలోని అన్ని చెరువులలో ఉచితంగా వంద శాతం సబ్సిడీతో మనమే ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఒకప్పుడు చేపలను ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకునే వాళ్ళమని, కానీ ఇప్పుడు మనమే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకునే స్థాయికి చేరుకున్నామని మంత్రి తెలిపారు. కాలం కాకపోయిన కాళేశ్వరం నుండి చెరువులు, కుంటాలకు నింపే స్థాయికి నీళ్లు ఉన్నాయని మంత్రి హరీష్ రావు చెప్పారు.