ఏపీ ఉప ముఖ్యమంత్రి , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ ప్రచారం నిమిత్తం దక్షిణ భారతదేశంలోని ఆలయాల సందర్శనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని పవన్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్షేత్ర సందర్శనలో పవన్ కళ్యాణ్‌తో కుమారుడు అకీరా, టిటిడి సభ్యుడు ఆనందసాయి పాల్గొన్నారు.
గత వారం రోజులుగా పవన్ కళ్యాణ్ పబ్లిక్ మీటింగ్స్ కు హాజరుకావడం లేదు. జ్వరం, స్పాండిలైటిస్‌తో బాధపడుతున్నారని ఆయన రెస్ట్ తీసుకుంటున్నారని జనసేన వర్గాలు ప్రకటించాయి. అనారోగ్య కారణాలతో ఆయన కేబినెట్ మీటింగ్ కు కూడా హాజరుకాలేదు. నిన్న సీఎం చంద్రబాబు.. సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో నిర్వహించిన సమావేశానికి పవన్ డుమ్మా కొట్టారు. పవన్ కళ్యాణ్ అనారోగ్య కారణాలతో మీటింగ్‌కు హాజరుకాలేకపోయారని నిన్నటి మీటింగ్ లో మంత్రి నాదెండ్ల మనోహర్ .. చంద్రబాబుకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం పవన్ విశ్రాంతి తీసుకుంటున్నారనే వార్తలు వచ్చాయి. ఇంతలోనే ఆయన కేరళలో ప్రత్యక్షమయ్యారు. దక్షిణాది పుణ్య క్షేత్రాల సందర్శనకు బయల్దేరారు. ఆయనతో పాటు కొడుకు అకీరా కూడా పుణ్యక్షేత్రాల సందర్శనలో పాల్గొంటున్నారు.