స్వతంత్ర వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆయన వారాహి యాత్రను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన ఈరోజు జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులను స్వీకరిస్తున్న సమయంలో తీవ్ర వెన్ను నొప్పికి గురయ్యారు. కాసేపు రిలాక్స్ అయినప్పటికీ నొప్పి తగ్గలేదు. దీంతో ఆయన జనవాణి కార్యక్రమాన్ని ఆపేసి, అక్కడి నుంచి వెళ్లిపోయారు.
‘గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ సమయంలో ఆయన వెన్నుపూసకు గాయమయింది. తాను తరచుగా వెన్ను నొప్పికి గురవుతున్నానని 2019లో ఆయన ప్రకటించారు. గత ఎన్నికల సమయంలో అశ్రద్ధ చేయడం వల్ల వెన్ను నొప్పి పెరిగిందని ఆ ప్రకటనలో ఆయన వెల్లడించారు. పవన్ వెన్ను నొప్పికి గురికావడంతో అభిమానులు, జనసైనికులు ఆందోళన చెందుతున్నారు.