OYO Founder Ritesh Father Died: ఓయో రూమ్స్ వ్యవస్థాపకుడు రితేశ్ అగర్వాల్ ఇంట విషాదం నెలకొంది. 20వ అంతస్తు నుంచి పడి అతడి తండ్రి రమేశ్ అగర్వాల్ మృత్యువాత పడ్డారు. రితేశ్ వివాహం జరిగిన మూడు రోజులకే ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గురుగ్రామ్‌లోని సెక్టార్ 54లోని DLFకు చెందిన ది క్రెస్ట్ సొసైటీలో రితేశ్ కుటుంబం నివాసం ఉంటోంది. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రమేశ్ అగర్వాల్ 20వ అంతస్తు నుంచి పడిపోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఫిర్యాదూ రాలేదని, ఎలాంటి సూసైడ్ నోటు కూడా లభ్యం కాలేదని పోలీసులు పేర్కొన్నారు. కాగా మార్చి 7న ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో రితేశ్ పెళ్లి గ్రాండ్ గా జరిగింది. ఈ వివాహానికి జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ వ్యవస్థాపకుడు, సీఈఓ మసయోషి సన్, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ, లెన్స్‌కార్ట్ నిర్వాహకులు పీయూష్ బన్సల్, ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి వంటి కార్పొరేట్ దిగ్గజాలు హాజరయ్యారు.