స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi), బీజేపీ సర్కారుపై విరుచుకుపడ్డ కాంగ్రెస్ లోక్‌సభ పక్షనేత అధిర్ రంజన్ చౌదరిపై (Adhir Ranjan Chaudhary) గురువారం సస్పెన్షన్ వేటు పడింది. అవిశ్వాస తీర్మానంపై (No Confidence Motion) చర్చలో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ ప్రొసీడింగ్స్‌ను అడ్డుకున్నారంటూ సభ నుంచి సస్పెండ్ చేశారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి దీనికి సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. ఈ అంశంపై ప్రివిలేజెస్ కమిటీ తన నివేదిక సమర్పించేవరకు ఆయనపై సస్పెన్షన్ కొనసాగనుంది. అయితే కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేతపై సస్పెన్షన్(Suspension) వేటు పడటం ఇదే తొలిసారి. దీనిపై అధిర్ మాట్లాడుతూ.. ‘‘నేనేవర్ని కించపర్చలేదు. నేనేమీ తప్పుగా మాట్లాడలేదు’’ అని అన్నారు. అయితే నేడు విపక్ష ఇండియా కూటమి భేటీ కానుంది. ఎంపీ అధిర్ రంజన్ సస్పెన్షన్‌పై విపక్ష నేతలు భేటీ అవనున్నారు. సస్పెన్షన్‌పై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.