“ఆపరేషన్ విజయవంతం అయినప్పటికీ రోగి చనిపోయాడు.. ప్రతిసారీ కేసు ఇలాగే ఉంటుందా?” అధికార కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో తెలంగాణ స్పీకర్ జాప్యాన్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సీరియస్ అయింది. నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ జాప్యం చేయడంపై అసహనం వ్యక్తం చేసింది. తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ, ఎన్నికల సంఘం, ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మార్చి 22 లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 25 కి వాయిదా వేసింది.
పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై జస్టిస్ బి.ఆర్ గవాయి ,జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ చేసింది. ఈ సందర్బంగా జస్టిస్ బి.ఆర్ గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు. రీజనబుల్ టైమ్ అంటే గడువు ముగిసే వరకా…? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య విధానాలు ఏం కావాలి…? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత సమయం కావాలో చెప్పండి.. ఆపరేషన్ సక్సెస్ , పేషంట్ డెడ్ అనే తీరు సరికాదని అన్నారు.
బిఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది అర్యమ సుందరం వాదనలు వినిపిస్తూ.. ఆలస్యం చేసే ఎత్తుగడలు అనుసరిస్తున్నారని అన్నారు. త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.
“గత ఏడాది మా పార్టీ ఎమ్మెల్యేలు మారారని స్పీకర్ కు ఫిర్యాదు చేశాం . ఆ తర్వాత హైకోర్టులో విచారణ జరిగింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ ను డివిజన్ బెంచ్ రివర్స్ చేసింది. ఇప్పటికే ఏడాది పూర్తయింది. కావాలని ఆలస్యం చేస్తున్నారు” అని బీఆర్‌ఎస్ తరపు సీనియర్ లాయర్ అర్యమ సుందరం అన్నారు.