స్వతంత్ర వెబ్ డెస్క్: రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటనలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇందులో భాగంగా ఆయన ఇవాళ రంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం షాద్‌నగర్ లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో ప్రసంగించారు. బీజేపీవాళ్లు నీళ్ల వాటా తేల్చరు.. కాంగ్రెస్ వాళ్లు కేసులేసి ఇబ్బంది పెడతరు అని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు.
రేవంత్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్ మనిషి అని కాంగ్రెస్ నేతలే చెప్పారు. రేవంత్ ఆర్‌ఎస్‌ఎస్ మనిషి అని కెప్టెన్ అమరేందర్ సింగ్ సోనియాకు లేఖ రాశారు. హామీలతో ప్రలోభపెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అధికారం ఇచ్చినప్పుడు ఏమీ చేయని కాంగ్రెస్ ఇవాళ అలవికాని హామీలు ఇస్తోంది. ఓటేస్తే షాద్ నగర్‌లో చందమామను కట్టేస్తా అని కాంగ్రెస్ నేతలు హామీలిస్తున్నారు. కాంగ్రేసోళ్లకు కర్ణాటక నుంచి బాగా పైసలు వస్తున్నాయట. బీజేపీ వాళ్లకు అదానీ నుంచి బాగా పైసలు వస్తున్నాయట. వాళ్లను దబాయించి పైసలు అడగండి. అని కేటీఆర్ అన్నారు.
రైతుబంధు డబ్బు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు వస్తేనే ఓటేయండని మంత్రి కేటీఆర్ ఓటర్లకు సూచించారు. తొమ్మిదేళ్లలో ఎన్నో మంచి పనులు చేసుకున్నామని… షాద్‌నగర్‌కు నీళ్లు ఇచ్చేది కేసీఆర్.. తెచ్చేది అంజయ్య యాదవ్.. అని అన్నారు. ఐదు రిజర్వాయర్లు తయారవుతున్నాయని.. లక్ష్మీదేవిపురం కూడా తయారవుతుందని తెలిపారు. కాంగ్రేసోళ్లు కడుపులో గుద్దుతరు.. నోట్లో పిప్పరమెంట్ పెడతరు.. అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.