స్వతంత్ర వెబ్ డెస్క్: ఆన్‌లైన్ గేమింగ్(Online gaming) కంపెనీలకు జీఎస్టీ(GST) అధికారులు ₹1 లక్ష కోట్ల విలువైన ట్యాక్స్ నోటీసులు పంపినట్లు ఓ అధికారి తెలిపారు.
ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు (Online gaming) బిగ్ షాక్. పన్ను ఎగవేతకు సంబంధించి దాదాపు రూ.1 లక్ష కోట్ల ట్యాక్స్ నోటీసులు జీఎస్టీ అధికారులు ఇప్పటి వరకు ఆయా సంస్థలకు పంపించారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అక్టోబర్ 1 తర్వాత కొత్తగా విదేశీ గేమింగ్ కంపెనీలు(Foreign gaming companies) దేశంలో రిజిస్టర్ అయినట్లు డేటా ఏదీ లేదని సదరు అధికారి తెలిపారు.
ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు సంబంధించి జీఎస్టీ (GST) చట్టాన్ని ప్రభుత్వం సవరించిన సంగతి తెలిసిందే. విదేశీ ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు అక్టోబర్ 1 నుంచి తప్పనిసరిగా దేశంలో రిజిస్టర్ అవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే, ఆన్‌లైన్ గేమింగ్‌లో పెట్టే మొత్తం విలువపై 28 శాతం జీఎస్టీ విధించేందుకు జీఎస్టీ కౌన్సిల్(GST Council) నిర్ణయించింది. ఈ విషయంలోనే గేమింగ్ కంపెనీలకు, ప్రభుత్వానికి మధ్య వివాదం నెలకొంది. అక్టోబర్ 1 నుంచే పెంచిన 28 శాతం జీఎస్టీ వర్తిస్తుందని గేమింగ్ కంపెనీలు పేర్కొంటుండగా.. చట్టం ఇది వరకే అమల్లో ఉందని ప్రభుత్వం చెప్తోంది.
ఈ క్రమంలోనే డ్రీమ్ 11(Dream 11), డెల్టా కార్పొరేషన్(Delta Corporation) వంటి ఆన్‌లైన్ గేమింగ్(Online gaming) సంస్థలకు గత నెలలోనే షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో పాటు రూ.21వేల కోట్ల పన్ను ఎగవేతకు సంబంధించి గతేడాది సెప్టెంబర్‌లో గేమ్స్ క్రాఫ్ట్‌కు వేరేగా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే, దీనిపై కర్ణాటక హైకోర్టు(Karnataka High Court )ను సదరు కంపెనీ ఆశ్రయించడంతో అనుకూలంగా తీర్పు వెలువడింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం జులైలో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ బోర్డ్(GST Intelligence Directorate Board) ఇటీవలి తీసుకున్న నిర్ణయం ప్రకారం, ఆన్‌లైన్ గేమ్(Online game)లో గెలిచిన మొత్తంపై మాత్రమే కాకుండా పందెం మొత్తంపై కూడా 28 శాతం జీఎస్టీ విధించనున్నారు. ఈ నిర్ణయానికి అనుగుణంగా ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు ఇప్పటివరకు జరిగిన బెట్టింగ్‌ల ఆధారంగా ప్రీ-షోకాజ్ నోటీసు జారీ చేయబడింది. కంపెనీలు స్పందించేందుకు ఆయా కంపెనీలకు వారం రోజుల గడువును కూడా ఇచ్చాయి.
ఏఏ కంపెనీలకు ఎంత పన్ను నోటీసులు అనే విషయాన్ని ఓసారి పరిశీలిస్తే.. ఇందులో భాగంగానే కొన్ని కంపెనీలకు పదివేల కోట్ల చొప్పున జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ ముంబై కార్యాలయం గత శుక్రవారం ఈ మొత్తానికి నోటీసు జారీ చేసింది. వీటి విలువ దాదాపు 55000 కోట్లు కావడం విశేషం. ఇంకా ఇందులో మిగిలిన కంపెనీల గురించి చూస్తే ‘డ్రీమ్ 11’కి రూ.25000 కోట్లు, ‘రమ్మీ సర్కిల్’, ‘మై 11 సర్కిల్’ తదితర సంస్థలకు చెందిన ‘ప్లే గేమ్స్ 24*7’కి రూ.20000 కోట్లు. మరికొద్ది రోజుల్లో బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ కార్యాలయాల నుంచి కూడా నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత జారీ చేసిన పన్ను నోటీసుల మొత్తం రూ. 1 లక్ష కోట్లు దాటవచ్చని అంచనా వేస్తున్నారు.
భారత్‌లో నలభై కోట్ల మంది
భారత్‌లో నలభై కోట్ల మంది ఆన్‌లైన్ గేమ్ ఆడతారని అంచనా. కొవిడ్ తర్వాత మనదేశంలో ఆన్‌లైన్ గేమ్(Online game)లకు మరింత ఆదరణ పెరిగింది. భారత్ రెండో స్థానానికి ఎగబాకింది. మొదటి స్థానంలో చైనా ఉంది. కొవిడ్ మహమ్మారి కాలంలో భారత్‌లో ఆన్‌లైన్ గేమర్స్ పెరగడంతోపాటు ఆన్‌లైన్‌లో గేమ్ ఆడే సమయం కూడా పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న గేమ్‌లలో భారతీయ గేమింగ్ యాప్ ‘లూడో కింగ్’ అగ్రస్థానంలో నిలిచింది. హౌజట్ ఫాంటసీ క్రికెట్ రెండో స్థానం సాధించింది. తీన్ పత్తి ఆరో స్థానంలో ఉంది. ఉచితంగా (వాణిజ్య ప్రకటనలతో) ఆడే జాయిన్ క్లాష్ 3డీ, రియల్ క్రికెట్ లాంటివి పేదలను, పిల్లలను ఎక్కువగా ఆకట్టుకుంటే.. ఒక్కసారి యాప్‌ను కొనుగోలు చేసి.. ఉచితంగా ఆడుకునే తీన్ పత్తి, క్లాష్ ఆఫ్ క్లాన్స్, ఫ్రీ ఫైర్ తదితర ఆటలు మరింతగా రక్తి కట్టిస్తున్నాయి.