ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర-2’. వైఎస్సార్ తనయుడిగా ఇచ్చిన మాట కోసం జగన్ చేసిన అసాధారణ పాదయాత్ర రాజకీయాలను ఎలాంటి మలుపులు తిప్పిందనే కథాంశంతో ఈ చిత్రాన్ని దర్శకుడు మహి వి.రాఘవ్ తెరకెక్కిస్తున్నారు. ప్రజా సంక్షేమం కోసం, తండ్రి ఆశయ సాధన కోసం వై.ఎస్.జగన్ చేసిన ప్రామిస్‌ను ఎలా నిలబెట్టుకున్నారనేది ఈ సినిమా ప్రధానాంశం.
‘యాత్ర 2’లోని ప్రధాన పాత్రల గురించి ఇప్పటికే మేకర్స్ తెలియజేశారు. వైఎస్సార్ పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి … జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ జీవా నటించారు. భారతి పాత్రలో కేతికా నారాయణన్, చంద్రబాబు నాయుడు పాత్రలో మహేష్ మంజ్రేకర్, సోనియా గాంధీ పాత్రలో సుసాన్నె బెన్నెట్ నటించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్, నారా లోకేష్, షర్మిల పాత్రల్లో ఎవరు నటించారనే దానిపై పలు రకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి.
అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ‘యాత్ర 2’లో పవన్ కళ్యాణ్, నారా లోకేష్, వై.ఎస్.షర్మిల పాత్రలు ఉండవని తెలుస్తోంది. తండ్రి చేసిన వాగ్దానాన్ని నిలబెట్టటానికి జగన్ చేస్తున్న పోరాటం, తండ్రీ కొడుకుల మధ్య ఉన్న అనుబంధంలోని భావోద్వేగాన్ని ఆవిష్కరిస్తూ జగన్ చేసిన పాదయాత్ర గురించి మాత్రమే ‘యాత్ర 2’ చిత్రాన్ని దర్శకుడు మహి వి.రాఘవ్ రూపొందిస్తున్నారట. ఇతర పాత్రల మీద దృష్టి పెడితే తాను చెప్పాలనుకున్న ఎమోషనల్ పాయింట్‌ను చెప్పలేమని భావించిన డైరెక్టర్ ముందు నుంచి తన ప్రణాళిక ప్రకారం యాత్ర 2ను తెరకెక్కించినట్లు తెలుస్తోొంది.


