స్వతంత్ర వెబ్ డెస్క్: కాంగ్రెస్‌లో గెలిచి బీఆర్ఎస్‌లోకి వెళ్లిన 12 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేట్లు కూడా తాకనివ్వమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. కాంగ్రెస్ లీడర్లంతా ఏకమై బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తామన్నారు. ఏఐసీసీ ఆదేశాలు, జిల్లా ముఖ్య నాయకుల అనుమతితోనే తుమ్మల నాగేశ్వరరావుని కలిశామన్నారు. ఆయన సేవలు సమాజానికి అవసరం ఉన్నదనే ఉద్దేశ్యంతోనే పార్టీలోకి ఆహ్వానించామన్నారు.
సహచరులు ఆయన అభిమానులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటానని తుమ్మల చెప్పారన్నారు. తుమ్మల రాష్ట్ర రాజకీయాలు ప్రభావితం చేసే వ్యక్తి అని అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. అన్ని రంగాలపై అపారమైన అనుభవం ఉన్నదని, కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుందన్నారు. అవినీతి, అహంకారానికి అలవాటు పడ్డ బీఆర్ఎస్ తుమ్మల లాంటి మచ్చలేని నాయకులను రాజకీయాల్లో కనుమరుగు చేయాలని ప్లాన్ చేస్తున్నారన్నారు. కాంట్రాక్ట్ పనులు చేసుకునే కందాల ఉపేందర్ రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యే చేస్తే.. ఆయన తమ పార్టీకి అన్యాయం చేశాడన్నారు. తుమ్మలను విమర్శించే స్థాయి ఎవరికీ లేదన్నారు. ఊరు మీద పడి రాక్షసుడు చంపి తింటుంటే..ఊర్లో ఉన్నోళ్లంతా ఏకమై తరిమికొట్టినట్లే కేసీఆర్‌ను అందరం కలిసి కొడతామన్నారు.
ఇక అతి త్వరలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరావు కూడా కాంగ్రెస్‌లోకి చేరుతున్నారని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే అదిష్టానంతో సంప్రదింపులు పూర్తయ్యాయని చెప్పారు. సెప్టెంబరు రెండో వారంలో చేరే ఛాన్స్ ఉన్నదన్నారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 20 మంది కీలక నేతలు కూడా కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.