స్వతంత్ర వెబ్ డెస్క్: ఎన్నికల్లో డబ్బులు పంచి గెలిచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. బెంగళూరులో కాంగ్రెస్ నేతల ఇంట్లో 42 కోట్లు దొరికాయని.. కర్ణాటక కాంగ్రెస్ సర్కారులో అన్ని రంగాల్లో అవినీతి తాండవిస్తుందని అన్నారు. మెదక్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న మంత్రి కర్ణాటక సొమ్మును రాష్ట్రానికి తరలించడంలో కొంతమంది బిల్డర్స్ ప్రధాన పాత్ర వహిస్తున్నారని వెల్లడించారు. వ్యాపారస్థులు రాజకీయాలు చేస్తే తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. హస్తం నేతలు ఎన్ని కట్టలు పంచినా….. గెలుపు మాత్రం బీఆర్ఎస్దేనని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
“కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అక్రమంగా సంపాదించిన సంపాదన దొడ్డిదారిలో తెలంగాణకు చేరవేస్తున్నారు. బెంగళూరు నుంచి రూ.1,500 కోట్లు హైదరాబాద్ తరలించేందుకు యత్నించింది కాంగ్రెస్. ఇప్పటికే కొంత డబ్బు చెన్నైకు, హైదరాబాద్‌కు చేరిందని తెలుస్తోంది. నగదు తరలింపులో బిల్డర్లు, గుత్తేదారుల పాత్ర ఉంది. బిల్డర్లు, గుత్తేదారులు వ్యాపారం చేసుకోవాలి.. రాజకీయాల్లో జోక్యం వద్దు. కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఉన్నవాళ్లకే టికెట్ ఇస్తుంది. ఆ పార్టీలో ప్రజాస్వామ్యానికి ప్రజలకు గౌరవం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు టికెట్లు అమ్ముకున్నారని ఆరోపణ వస్తున్నాయి. అభ్యర్థి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు.” అని మంత్రి హరీశ్ రావు అన్నారు.