స్వతంత్ర వెబ్ డెస్క్: ఈ భూమి పుట్టినప్పటి నుంచి బిడ్డ జననానికి తల్లి గర్భం మూలంగా ఉన్నది. తర్వాత టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి వచ్చింది. టెక్నాలజీ రోజు రోజుకి పెరుగుతున్నట్లే.. బిడ్డ జనానికి సరికొత్త టెక్నాలజీ వస్తుంది. భవిష్యత్తులో పురుషుడు, మహిళతో సంబంధం లేకుండా ల్యాబోరేటరీలోనే శిశువులను తయారు చేసే పద్ధతి రానుంది. 2028లోగా ల్యాబ్‌లో శిశువులను అభిృవృద్ధి చేసేందుకు జపాన్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. తద్వారా సంతానలేమి, జననలోపాల్లాంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని క్యూషు యూనివర్సిటీ పరిశోధకులు చెప్తున్నారు.
ఆ పరిశోధకులు చేసిన అధ్యయనానికి సంబంధించిన వివరాలు జర్నల్ నేచర్‌లో ప్రచురితం అయ్యాయి. సాధారణ మానవ కణాలను ఉపయోగించి ల్యాబ్‌లో అండాలు, వీర్యాన్ని భారీగా ఉత్పత్తి చేయాలని శాస్త్రవేత్తలు లక్ష్యంగా చేసుకున్నారు. మగ ఎలుకలు చర్మ కణాలను ప్లూరిపోటెంట్ మూలకణాలుగా మార్చే పద్ధతిని అధ్యయనంలో వెల్లడించారు. ఇవి వివిధ రకాల కణాలు, కణ జాలాలుగా అభివృద్ధి చెందుతాయి. మగ ఎలుకల మూల కణాలను ఆడ కణాలుగా మార్చే ఔషధంతో ఈ కణాలను పెంచారు. ఇది అండం కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ అండాలు నవజాత మగ ఎలుకలను ఉత్పత్తి చేసేందుకు ఫలదీకరణం చేశారు. తాజా అధ్యయనంలో 630 పిండాలలో ఏడు మాత్రమే సజీవ ఎలుక పిల్లలుగా అభివృద్ధి చెందగలిగాయి. మానవ పునరుత్పత్తిలో తమ ప్రయోగం కొన్ని చిక్కులను కలిగి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.