స్వతంత్ర వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు వస్తున్నారు. ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ అలోక్ అరదేల పేర్లను సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ది జమ్మూ కాశ్మీర్ కాగా.. 2013లో అక్కడి హైకోర్టుకు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. 2022 జూన్ నుంచి బాంబే హైకోర్టు జడ్జిగా ఉన్నారు. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్‌ను మణిపూర్ హైకోర్టు సీజేగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. కేంద్రం దగ్గర పెండింగ్‌లో దాన్ని కొలీజియం రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మే నెలలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన సంగతి తెలిసిందే.
తెలంగాణ హైకోర్టు సీజేగా సిఫార్సు చేసిన జస్టిస్ అలోక్ అరదేది మధ్యప్రదేశ్. 2009లో అక్కడి హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2018 నవంబర్ నుంచి కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం ఏపీ తెలంగాణతో పాటుగా ఏడు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌లను సిఫార్సు చేసింది. బాంబేకి దేవేంద్రకుమార్, గుజరాత్‌కు సునీతా అగర్వాల్, మణిపూర్‌కు సిద్ధార్థ్ మృదుల్, కేరళకు ఆశిష్ దేశాయ్, ఒరిస్సాకు సుబాసిస్ తలపత్ర పేర్లను సిఫార్సు చేశారు.