స్వతంత్ర వెబ్ డెస్క్: సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్12 వాహకనౌక నింగిలోకి దూసుకుపోయింది. నిన్న ఉదయం ప్రారంభమైన కౌంట్‌డౌన్ ప్రక్రియ.. 27 గంటల 30 నిమిషాల పాటు కొనసాగిన తర్వాత సోమవారం ఉదయం 10.42 గంటలకు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్ళింది. ఈ వాహన నౌక ద్వారా ఎన్‌వీఎస్-01 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం ప్రవేశంతో పూర్తి స్థాయి స్వదేశి నావిగేషన్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఈ జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్12 పొడవు 51.7 మీటర్లు. బరువు 420 టన్నులు. ఇది 18 నిమిషాలకు ఉపగ్రహాన్ని 251 కి.మీ. ఎత్తులో జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టనుంది. ఈ ప్రయోగ పనులను ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్.సోమనాథ్ పర్యవేక్షించారు.
భారతదేశానికి చెందిన రెండో తరం నావిక్ ఉపగ్రహాల్లో ఎన్‌వీఎస్-01 మొదటిది. 2,232 కిలోల బరువున్న దీని జీవితకాలం 12 ఏళ్లు. ఈ ఉపగ్రహం భారత్ ప్రధాన భూభాగం చుట్టూ సుమారు 1500 కి.మీ పరిధిలో రియల్ టైమ్ పొజిషనింగ్ సేవలను అందిస్తుంది. నావిక్–01 ఉపగ్రహం సరికొత్తగా ఎల్–5, ఎస్–బాండ్‌ల సిగ్నల్స్‌తో పనిచేసే విధంగా రూపొందించారు ఇస్రో శాస్త్రవేత్తలు.. ఈ ఉపగ్రహం వల్ల భూమి, జల, వాయు మార్గాల స్థితిగతులు, దిక్కులు తెలియజేయడం, ఆపద సమయాల్లో భూగోళానికి సంబంధించిన సమాచారం అందించడం, వాహనచోదకులకు దిశానిర్దేశం చేయడం, ఇంటర్నెట్‌తో అనుసంధానం లాంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.