స్వతంత్ర, వెబ్ డెస్క్: దేశంలో స్థానిక రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. నేటి యూత్ కు సందేశమిస్తూ.. సామాన్యుల జీవితం సంతోషమయం చేయటానికి ఏం చేయాలో ఆలోచించాలని యువతకు దిశానిర్ధేశం చేశారు.. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలని అన్నారు. యువత రాజకీయాల్లోకి రావటానికి సిద్ధాంతం, నిబద్ధతతో ఉండాలన్న వెంకయ్య… అవినీతి, అక్రమాలు, అస్తవ్యస్థ విధానాలు తొలగించటానికి యువత ముందుకు కదలాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం నాయకులు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తెలియటం లేదు. ప్రజాప్రతినిధులుగా గెలిచిన తర్వాత చట్ట సభల్లో హుందాగా ఉండాలి. బూతులు మాట్లాడే వారి సంగతి పోలింగ్ బూత్ లో తేల్చండి. అంటూ నేటి రాజకీయ నాయకులకు చురకలు అంటించారు. ఇవన్నీ జరగాలంటే యువత రాజకీయాల్లోకి రావాలి. రాజకీయాల్ని ప్రక్షాలన చేయాలంటే యువత అవసరం ఉంది. బ్యాలెట్ అనేది బుల్లెట్ కంటే చాలా శక్తివంతమైనది.. అంటూ యువతలో శక్తిని నింపారు.
గుంటూరు జిల్లా ఆర్వీఆర్ జేసీ ఇంజనీరింగ్ కాలేజి గ్రాడ్యుయేషన్ డేలో పాల్గొన్న ఆయన.. విద్యలో ప్రతిభ కనబర్చిన వారికి పతకాలు అందజేశారు. ఈ సందర్బంగా వెంకయ్య మాట్లాడుతూ.. కలలు కనడంతో మానొద్దు.. కష్టపడి వాటిని సాధించండి అంటూ విద్యార్థులకు సూచించారు. మంచి ఆలోచనలు పెంచుకోండి, మంచి స్నేహితుల్ని ఎంచుకోండని హితవు పలికారు. నేర్చుకున్న విజ్ఞానాన్ని ప్రజల కోసం ఉపయోగించాలని అన్నారు. విద్యావిధానం మళ్లీ భారతీయకరణ వైపు నడుస్తోందన్నారు. సంపద పెంచుకో ఇతరులతో పంచుకో అనేది మన భారతీయ విధానమని తెలిపారు.