కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం 4 శాతం పెంచుతూ(DA Hike) కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో 38 శాతం ఉన్న ఉద్యోగుల డిఎ 42 శాతానికి పెరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన కేంద్రమంత్రిమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అలాగే ఉద్యోగుల డిఎ పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రిమండలి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దాదాపు కోటి మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్రం వెల్లడించింది. ఈ పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి రూ.12,815 కోట్ల రూపాయల భారం పడుతుందని కేంద్రప్రభుత్వం వెల్లడించింది. పెంచిన డిఎ(DA Hike) ఈ ఏడాది జనవరి 1వ తేదీనుంచి వర్తిస్తుందని తెలిపింది. 2022 సెప్టెంబర్‌లో చివరగా కేంద్రం డిఎను సవరించింది. ఏడాదిలో రెండు సార్లు డిఎ సవరించడం జరుగుతుంది.