కొత్త సినిమాల రిలీజ్ సమయంలో టికెట్ రేట్లు పెంచాలని తమ వద్దకు వచ్చే సినీ ప్రముఖులు విధిగా డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం కోసం ఓ వీడియో రూపొందించి ఇవ్వాలని…తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల స్పష్టం చేశారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి స్వచ్ఛందంగా డ్రగ్స్ వ్యతిరేక వీడియో రూపొందించి తెలంగాణ ప్రభుత్వానికి అందించారు. తాజాగా, హైదరాబాద్‌లో ప్రమోషన్ ఈవెంట్లతో బిజీగా ఉన్న భారతీయుడు-2 చిత్ర బృందం కూడా డ్రగ్స్‌పై అవగాహన వీడియో రూపొందించింది. కమల్ హాసన్, దర్శకుడు శంకర్, నటులు సిద్ధార్థ్, సముద్రఖని ఈ వీడియోలో సందేశం అందించారు.
దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. భారతీయుడు-2 చిత్ర బృందానికి తన ప్రత్యేక అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రజా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి మద్దతుగా కమల్ హాసన్, శంకర్, సిద్ధార్థ్, సముద్రఖని కలిసి అవగాహన వీడియో రూపొందించడం హర్షణీయం అని పేర్కొన్నారు. ఈనేపథ్యంలోనే ఆయన భారతీయుడు-2 చిత్ర బృందం రూపొందించిన వీడియోను షేర్ చేశారు.


