స్వతంత్ర, వెబ్ డెస్క్: ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ ఘటనను ఇంకా మర్చిపోకముందే ముంబయిలో ఇదే తరహా కేసు వెలుగులోకి వచ్చింది. తనతో సహజీవనం చేస్తోన్న ఓ మహిళను కిరాతకంగా హత్య చేసి ఆమె శరీర భాగాలను ముక్కలుగా చేశాడు. మనోజ్ సహానీ అనే 56ఏళ్ల వ్యక్తి సరస్వతి వైద్య(36) అనే మహిళతో మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఇద్దరు మీరా రోడ్డులోని ఓ ఇంటిలో అద్దెకు ఉంటున్నారు.
అయితే అతడి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మనోజ్ ఫ్లాట్‌లో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఆమె శరీరాన్ని కట్టర్ ఉపయోగించి ముక్కలుగా కోసినట్టు గుర్తించారు. అనంతరం శరీరభాగాలను కుక్కర్‌లో వేసి ఉడకబెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.