మట్టిలో మాణిక్యాలు ఎవరు..? మరుగున పడిన వాగ్దేవీ పుత్రులు, లోకానికి తెలియని విద్యా సద్గుణ సంపన్నులు. ఇంతేనా…వ్యక్తులకే ఇది వర్తింపా..? అంటే ఓ దేవళం తాను మట్టిలో మాణిక్యాన్నే అంటోంది. ఏక దైవ సన్నిధిలో ద్వి శైవ రూపాలతో దర్శనమిచ్చే సుందర, ప్రాచీన, మహిమాన్విత, మహోన్నత మహదేవుని ఆలయం అడవుల జిల్లా ఆదిలాబాద్ లో ఉన్న సంగతి ఎందరికి తెలుసు..? విశ్వవిఖ్యాత గిరిజన నాగోబా జాతర జరిగే పుష్య మాసంలోనే మహదేవుని జాతర జరగడం ఎంత విశేషం..? సదల్ పూర్ ద్వి శైవ రూప మహాదేవ ఆలయ జాతర, నాగోబా జాతర రోజుల వ్యవధిలో జరగడం విచిత్రం.
మహత్తర పర్వదినాలు, మహా శివరాత్రి వచ్చినప్పుడు హర హర మహదేవ, శంభో శంకర…అంటూ భక్తుల శరణు ఘోషతో శైవక్షేత్రాలు మార్మోగిపోతాయి. ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతర జరిగే మాసంలో మరో మహిమాన్విత జాతర మహదేవుని ఆలయ సన్నిధిలో అత్యద్భుతంగా జరుగుతుందనే విషయం విశ్వవిదితం కాలేదు. ఇక్కడి జాతర ఉత్సవాలకు కొన్నేళ్లుగా భక్తులు వస్తున్నా విశ్వవ్యాప్తం కాలేదు. ఈ ఆలయ విశిష్టత సర్వవిదితం అవుతే.. మరో సమ్మక్క సారలమ్మ జాతర, నాగోబా జాతర, కుంభమేళా, పుష్కరాలు, విశ్వవిఖ్యాత పుణ్యక్షేత్రాల్లో ప్రవహించే భక్తజన వరద మాదిరి.. ఇక్కడ అశేష భక్తజనసందోహంతో నిండిపోతుందనే విషయంలో ఏ మాత్రం సందేహం లేదని స్థానిక భక్తులు, ఆలయ నిర్వాహకులు తెలియజేస్తున్నారు.
రాష్ట్రంలో ఒకే దైవసన్నిధిలో ద్వి శైవ రూపాలతో ఉన్న మహిమాన్విత మహాదేవ ఆలయం మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో నెలకొని ఉంది. తెలుగు, మరాఠీ రాష్ట్రాల భక్తులకు కొంగుబంగారంలా ఉన్న ఈ ఆలయం మహాదేవ్ బైరందేవ్ క్షేత్రంగా విరాజిల్లుతోంది. గరళ కంఠుడు, సరళ హృదయుడు, ఆదిదేవుడు, మహిమాన్వితుడైన మహాదేవుని మహత్తర క్షేత్రాన్ని దర్శిస్తే బాధలు, వ్యధలు, కష్టాలు కడతేరిపోతాయని, ఆయురారోగ్య ఆష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. పన్నగహారుడు, పార్వతీ రమణుడైన పరమేశ్వరుడు ఇక్కడ మహదేవుడిగా కొలువై ఉండి.. భక్తుల భవతరణాలను హరిస్తున్నాడని భక్తజన కోటి నమ్ముతోంది.
కాకతీయ ప్రభువుల కాలం లో సదల్ పూర్ లో నిర్మించిన రెండు ఆలయాలు మహదేవ ఆలయం, బైరం దేవ ఆలయం.ఈ అతి ప్రాచీన ఆలయాల్లో ప్రతి ఏటా పుష్యశుద్ద అమావాస్య వరకు జాతర మహత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయిదు రోజులపాటు జాతర జరుగుతుంది. మహాదేవునికి క్షీరాభిషేకం, ప్రత్యేక పూజలు చేసిన అనంతరం జాతర వేడుకలు మొదలవుతాయి. పెద్ద ఎత్తున తరలివచ్చే గిరిజన భక్తులు కాలభైరవుడిని, బైరందేవ్ గా ఆరాధిస్తారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలు, మహరాష్ట్రవాసులు ఈ జాతర వేడుకల్లో పాల్గొంటారు.
భైరం దేవ్ ఆలయంలో మహదేవుని మహిమాన్విత శివలింగంపై భక్తులకు ఓ గొప్ప నమ్మకం ఉంది. మనస్సులో మొక్కులు తల్చుకుని శివలింగాన్ని ఎత్తితే… నెరవేరే కోరిక అయితే ఆ శివలింగం పైకి లేస్తుందని, నెరవేరని కోరికైతే శివలింగం పైకి లేవదని భక్తులు చెబుతున్నారు. శివలింగాన్ని ఎత్తడం అనాదిగా వస్తున్న సదాచారమని ఆదివాసీ భక్తులు చెబుతున్నారు. బేల మండలానికి సమీపంలో ఉన్న ఏజెన్సీ ఏరియాలోని గిరిజనులు తరచు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. ఇక్కడికి సమీపంలోని ఏజెన్సీ గ్రామాల ప్రజలు కాలినడకన వచ్చి భైరందేవుడిని, మహాదేవుడిని దర్శించుకుని పూజలు, ప్రార్థనలు చేస్తారు.
ఆదివాసిలు, అడవిబిడ్డల నివసిత ప్రదేశమైన ప్రశాంత అటవీ ప్రాంతంలో ఇంత గొప్ప శివాలయం ఉండడం ఎంతో సంతోషదాయకమని పలువురు భక్తులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆలయానికి పూర్వవైభవం తీసుకురావాలని, ప్రాచీన ప్రాభవానికి దెబ్బతినకుండా.. ఆధునిక సొబగులతో ఆలయాలన్ని తీర్చిదిద్దాలని భక్తజనులు కోరుతున్నారు.