స్వతంత్ర వెబ్ డెస్క్: భారీ వర్షాలు, వరదలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. చాలా చోట్ల వరదనీటిలో మునిగిపోయాయి గ్రామాలు. భూపాలపల్లి జిల్లా మొరంచవాగు ఉగ్రరూపం దాల్చడంతో గ్రామం మొత్తం నీటమునిగింది. ఊరంతా నీటమునగడంతో బిల్డింగులపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకుంటున్నారు స్థానికులు. గొడ్డూ గోదను సైతం డాబాలపైకి ఎక్కించి కాపాడుకుంటున్నారు. ఇప్పటికే వరదల్లో ఇద్దరు కొట్టుకుపోగా.. కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఊళ్లో మొత్తం 1500మంది గ్రామస్తులు ఉండేవారని తెలుస్తుంది. ఊళ్లో జనం అంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
మొరంచవాగు ఉధృతికి ఇళ్లల్లో సామగ్రి తడిసి.. గ్రామస్థులు అన్నమో రామచంద్రా అంటూ అలమటిస్తున్నారు. పిల్లలు, వృద్ధుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. గ్రామ పరిస్థితి తెలుసుకున్న ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి.. విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. హెలికాప్టర్ సౌకర్యం కల్పించాలని కోరారు. సీఎం కేసీఆర్ సైతం గ్రామంలో పరిస్థితి గురించి ఆరా తీశారు. భూపాలపల్లి మొరంచపల్లిలో వరద ఉధృతితో అల్లాడుతున్నారు గ్రామస్థులు. ప్రాణాలు రక్షించమంటూ అధికారులకు ఫోన్లు చేస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో చనిపోయినట్లు చెబుతున్నారు.