స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలో కురిసిన రికార్ఢు స్థాయిలో కురిసిన వర్షాలు, పోటెత్తిన వరద ప్రవాహం జయశంకర్ భూపాలపల్లి జిల్లాను పూర్తిగా దెబ్బతింది. జిల్లాలో మొరంచపల్లి గ్రామంలోని మొరంచవాగు వరద ఉధృతి తగ్గడంతో వరదల్లో కొట్టుకుపోయిన వారి మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు ఎన్నడూ చూడనంత వర్షాలు, వరదలతో భూపాలపల్లి జిల్లా మొరంచపల్లి గ్రామ ప్రజలతో పాటు చెల్పూర్ గ్రామాల ప్రజలు సర్వం కోల్పోయారు. ఈ వరద ముంపులో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి మృతి చెందిన వారి సంఖ్య 11కి చేరింది.
వరద ముంచిన మొరంచపల్లి గ్రామంలోని ప్రజల్ని ఆదుకునేందుకు వరదలో గల్లంతైన వారిని గాలించేందుకు ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయకచర్యలు చేపట్టాయి. ముఖ్యంగా ఇళ్లు మునిగి ఇంటి పైకప్పులపై నిల్చున్న వారిని రక్షించారు. తీవ్ర విషాదాన్ని నింపిన మొరంచపల్లి గ్రామాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పరిశీలించారు. వరద బాధితులకు.. వరద ప్రవాహంలో సర్వం కోల్పోయిన వారికి అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. మొరంచవాగు వరద ఉధృతి తగ్గడంతో ప్రవాహంలో కొట్టుకుపోయిన వారి మృతదేహాలు ఒక్కొక్కటిగా లభ్యమవుతున్నాయి. ఇప్పటి వరకు 11మంది మృతదేహాలను రెస్క్యూ బృందాలు గుర్తించాయి. ఇందులో రెండు కిలో మీటర్ దూరంలో లభించినట్లుగా తెలిపారు.
ముఖ్యంగా వరంగల్ నగర ప్రజలు వరద నీటిలో చిక్కుకున్నారు. హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ ప్రాంతాలైన విద్యాధరపురి కాలనీలు పూర్తిగా జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ఇప్పటికి జలదిగ్భందంలో చిక్కుకున్న వరద బాధితులకు ఆహార పొట్లాలు, వాటర్ ప్యాకెట్స్‌ను అందిస్తున్నారు. వరద నీటిలో చిక్కుకున్న వారిలో ఏడుగురి ఆచూకి గల్లంతైంది. మనుషులే కాదు 150కి పైగా బర్రెలు, 750 కోళ్లు చనిపోయాయి. మరో 50 గొర్రెలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లుగా స్థానికులు చెబుతున్నారు.