అట్టహాసంగా జరిగిన కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో అనుకోని అతిథి ప్రత్యక్షమైంది. ఓ జంతువు స్టేజీ వెనక భాగంలో కనిపించింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పులిని పోలిన ఉన్న ఆ జంతువుపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దేశ ప్రధానిగా నరేంద్రమోదీ మరో సారి ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు 71 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో దేశ, విదేశాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు హాజర య్యారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో జరిగిన ఈ వేడుకలో ఓ జంతువు కనిపించింది.
ప్రధాని సహా పలువురు కీలకమంత్రులు ప్రమాణస్వీకార కార్యక్రమం పూర్తయ్యాక ఈ ఘటన చోటుచేసు కుంది. మధ్య ప్రదేశ్ నుంచి బీజేపీ తరఫున గెలుపొందిన దుర్గాదాస్ ఉయికె ప్రమాణస్వీకారం చేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ధన్యవాదాలు తెలియజేస్తున్న సమయంలో ఓ జంతువు అటుగా వెళ్లడం కనిపించింది. ప్రమాణ స్వీకార వేదికకు కాస్త దూరంలోనే సంచరించడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్‌మీడియా వేదికగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. తొలుత ఫేక్ వీడియో లేదా ఏఐ జనరేటెడ్ వీడియో అని కొట్టిపారేశారు. తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం నిన్న షేర్ చేసిన యూట్యూబ్ లైవ్ ఫీడ్‌ను పరిశీలించినప్పుడు ఓ జంతువు సంచరించడం నిజమేనని తేలింది. నడుస్తున్న ఠీవిని బట్టి అది పులి అని కొందరు పిల్లి అయ్యుంటుందని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇంకేదైనా పెంపుడు జంతువు కావొచ్చనన్న ఊహాగానాలూ వెలువడుతున్నాయి. దీనిపై రాష్ట్రపతి భవన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.


