స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రతి నెల చివరి ఆదివారం జరగాల్సిన మన్ కీ బాత్ కార్యక్రమం ఈ సారి వారం ముందే జరిగింది. 102వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసింగించారు. వచ్చే వారం అమెరికా పర్యటనకి వెళ్లనున్న మోదీ తన పర్యటన గురించి శ్రోతలతో పంచుకున్నారు. ఈసారి మన్ కీ బాత్ వారం ముందుగానే జరుగుతోందని ప్రధాని చెప్పారు. వచ్చే వారంలో తాను అమెరికాలో ఉంటానని ప్రధాని మోదీ మన్ కీ బాత్‌లో తెలిపారు. అక్కడ బిజీగా ఉంటారు అందుకే యాత్రకు వెళ్లే ముందు తన పౌరులతో మాట్లాడాలని అనుకున్నానని ప్రధాని చెప్పారు. మీతో సంభాషిస్తే.. మీ ఆశీస్సులు, స్ఫూర్తితో నా శక్తి కూడా పెరుగుతుందని ప్రధాని అన్నారు. ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీని స్మరించుకుని ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ నెల ప్రారంభంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తయ్యాయని ప్రధాని చెప్పారు. ఈ సందర్భాన్ని పెద్ద పండుగలా జరుపుకున్నారు. ‘వారి నైపుణ్యాలను తెలుసుకోవడం, వారి నుండి నేర్చుకోవడం మనందరి కర్తవ్యం. దీనితో, మనలో మన వారసత్వం గురించి మనం గర్వపడతాము. భవిష్యత్తుకు కూడా స్ఫూర్తిని పొందుతాము’ అని మోడీ అన్నారు. ఇక ఈ వారం మోదీ ప్రసంగంలో ఎమర్జెన్సీని ప్రస్తావించారు. ఇది దేశానికి చీకటి అధ్యాయమన్నారు. ఈరోజుకు కూడా ఆ సమయం గుర్తొచ్చినప్పుడల్లా తన మనసు వణికిపోతుందన్నారు. నీటి సంక్షోభం, టీబీ రహిత భారత్ ప్రచారం గురించి కూడా ప్రధాని మాట్లాడారు.