‘‘చీకటితో వెలుగు చెప్పెను…నేనున్నాననీ…
ఓటమితో గెలుపే చెప్పెను…నేనున్నానని…’’
ఒక స్ఫూర్తిమంతమైన పాట,
‘‘రాలిపోయే పూవా…నీకు రాగాలెందుకే…’’ ఒక విషాద గీతిక
‘‘జాము రాతిరి జాబిలమ్మా…జోలపాడనా ఇలా…’’మనసుకి హాయి కలిగించే పాట
‘నిన్ను రోడ్డు మీద చూసినదీ లగాయిత్తు’’ ఒక మాస్ పాట
‘‘పుణ్యభూమి నా దేశం నమో నమామీ’’ దేశభక్తి గీతం
‘‘కలలో నీ నామస్మరణా…మరువ చక్కనీ తండ్రి…’’ భక్తి గీతం
‘‘పదహారు కళలకు ప్రాణాలైనా…నా ప్రణవ ప్రణయ దేవతలకు ఆవాహనం’’ లాంటి శృంగార గీతం
‘జటా కటాహ సంభ్రమభ్రమన్నిలింప నిర్ఘరి’ అని బాహుబలిలో సంస్క్రత పాట

‘తెలుసా…మనసా…ఇది ఏనాటి అనుబంధమో’ తెలుగు సినిమా పాట బతికి ఉన్నంత కాలం నిలిచే అద్భుత పాట
ఇలా చెప్పుకుంటూ పోతే…ఎన్నో…ఎన్నెన్నో కొన్ని వేల గీతాలు…ఆయన స్వరం నుంచి జాలువారి…తెలుగు ముంగిళ్ల ముంగిట నాట్యమాడాయి. తెలుగువారి నోట జాలువారాయి. తెలుగుతనంతో తుళ్లి తుళ్లి గెంతులేశాయి.
ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే స్వర సరస్వతి…కీరవాణికి దేశ అత్యున్నత పురస్కారం ‘పద్మశ్రీ’ వరించింది. ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న ఆర్ఆర్ఆర్ ‘నాటు-నాటు’ పాట నేపథ్యం, అంతేకాదు ఆస్కార్ ముంగిట నిలిచి ఉన్న సందర్భంలో…ప్రపంచమంతా కీరవాణి పాటను ఆస్వాదిస్తున్న సమయంలో భారత ప్రభుత్వం రిపబ్లిక్ డే నాడు ప్రతిష్టాత్మకంగా ఇచ్చే పద్మశ్రీ అవార్డుకు ఎంపికవడంతో భారతదేశమంతా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
చిన్నసినిమాతో సాగించిన కీరవాణి ప్రయాణం…నేడు ఆస్కార్ స్థాయి వరకు వెళ్లింది. మారుతున్న కాలానికి తగినట్టుగా ఆయన తన బాణీలను, స్వరాలను మార్చుకుంటూ వెళ్లడమే ఆయన విజయ రహస్యం అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మ్యూజిక్ ట్రెండ్ మారిపోయింది. బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్ రొద ఎక్కువై పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో సమర్థవంతంగా నడిపించి…గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించడమే కాదు…ఇప్పుడు ఆస్కార్ ముంగిట 5 అడుగుల దూరంలో నిలిచింది.

అయితే కీరవాణి ఒక్క తెలుగు చిత్రమే కాదు, కన్నడ, మళయాళం, తమిళం, హిందీ చిత్రాలకు సంగీతం అందించారు. 1990లో ‘మనసు మమత’ ఆయన మొదటి చిత్రం…తర్వాత కొంత గ్యాప్ వచ్చినా సీతారామయ్యగారి మనవరాలు, క్షణక్షణం’ చిత్రాల నుంచి ఆక ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. నాగార్జునతో ఆయన ఎక్కువ చిత్రాలు చేశారు. వారిది హిట్ కాంబినేషన్ అంటారు. వారసుడు, అల్లరి అల్లుడు, రక్షణ, క్రిమినల్, నేనున్నాను, అన్నమయ్య ఇలా ఎన్నో చిత్రాలకు పనిచేశారు. ఆ తర్వాత దర్శకుడు రాఘవేంద్రరావుతో 28 సినిమాలకు చేశారు. దాదాపు 250 సినిమాలకు ఆయన సంగీత దర్శకత్వం వహించారు.
తమ్ముడు రాజమౌళి దర్శకుడిగా మారిన తర్వాత…అతనితో కలిసి చేసిన ప్రయాణమే…కీరవాణిని ఈ స్థాయికి తీసుకువచ్చింది. రాజమౌళి తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లాడు. అతనితో పాటు కీరవాణి ఇప్పుడా ఫలాలను అందుకుంటున్నాడు. రాజమౌళి ఆలోచనలకు తగినట్టుగా సంగీతాన్ని అందించి..ఇప్పుడు శభాష్ అనిపించుకున్నాడు.
62 సంవత్సరాల కీరవాణి ఒక రైతు కుటుంబంలో 1961న జన్మించారు. వీరిది పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు. తండ్రి పేరు కోడూరి శివ శక్తి దత్తా. ఆయనకు సంగీత జ్నానం ఉంది. తల్లి భానుమతికి వీణలో ప్రావీణ్యం ఉంది. అలా తల్లిదండ్రుల దగ్గర నుంచి వారసత్వంగా వచ్చిన సంగీత శక్తిని ఆకలింపు చేసుకుని, అందులో అక్షరాలు నేర్చుకుని, నేడీ స్థాయికి కీరవాణి చేరుకున్నాడు.

అయితే హిందీలో ఆయన పేరు ‘క్రీమ్’, తమిళంలో ‘మరకతమణి’ ఇలా పేర్లెన్ని మారినా నేడు ప్రపంచం అంతటికీ ‘కీరవాణి’ గా పరిచయమయ్యారు.
అన్నమయ్య సినిమాకి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ తరఫున ఉత్తమ సంగీత దర్శకుడిగా 8సార్లు, ఉత్తమ నేపథ్యగాయకుడిగా మూడు సార్లు నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలో ‘నాటు నాటు’ పాటకి గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని, క్రిటిక్స్ ఛాయిస్ మూవీ అవార్డులని అందుకున్నారు. ఇక ఆస్కార్ అవార్డుల కోసం నామినేషన్ కూడా దక్కించుకుని చరిత్ర సృష్టించింది.