వరంగల్ జిల్లా రాజకీయం యమ రంజుగా సాగుతోంది. కడియం వర్సెస్ ఆరూరి ఎపిసోడ్‌తో పొలిటికల్ సెగలు కక్కుతోంది. మొన్నటి వరకూ ఒకగూటి పక్షులైన వీరిద్దరూ..దశాబ్ధాల కొద్దీ రాజకీయ వైరం ఉన్న జాతీయ పార్టీల్లో చేరిపోవడంతో పొలిటికల్ వార్ ముదురుతోంది. విమర్శలు, ప్రతివిమర్శ లతో మాటల తూటాలు పేలుతున్నాయి. కడియం శ్రీహరి, ఆరూరి రమేష్ కొన్ని నెలల ముందు వరకు బీఆర్ఎస్‌లోనే ఉన్నారు.వరంగల్‌లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్‌కు టికెట్ లేదని తేలిపోవడంతో ఆరూరి రమేష్ రేసులో నిలబడ్డారు. అయితే కడియం శ్రీహరి ఆరూరికి టికెట్ రాకుండా అడ్డుపడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. తన కూతురు కావ్యకు టికెట్ ఇచ్చేలా మంతనాలు నడిపించారు కడియం. దీంతో కావ్యకు బీఆర్‌ఎస్ ఎంపీగా టికెట్ కన్‌ఫర్మ్ కావడం.. ఆరూరి పార్టీ ఫిరాయించడం జరిగిపోయింది. గులాబీకి గుడ్‌బై చెప్పి ఆరూరి కమలం తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో తాను డిమాండ్ చేసినట్టే బీజేపీ టికెట్ ఇచ్చింది. అయితే,.. కావ్యకు బీఆర్‌ఎస్ టికెట్ ఇచ్చినప్పటికీ… దాన్ని కాదని కావ్యతో సహా కడియం శ్రీహరి హస్తంతో చేయి కలిపారు. కాంగ్రెస్ కూడా కావ్యకు టికెట్ ఇచ్చింది. దీంతో ఒకగూటి పక్షులు కాస్తా పార్టీ ఫిరాయింపుతో ఆరూరి రమేష్, కావ్య ప్రత్యర్థులుగా పార్లమెంట్ బరిలో నిలిచారు.
బీఆర్‌ఎస్ నుంచి టికెట్ రాకుండా అడ్డుపడి, పార్టీ మారడానికి కారణమైన కడియం, కావ్య తీరును జీర్ణించుకోలేని ఆరూరి రమేష్ ప్రత్యర్థిపై విమర్శల విల్లు ఎక్కుపెట్టారు. ఏ చిన్న అవకాశాన్ని వదల కుండా ప్రజల్లో పలుచన చేసి.. తద్వారా ఓటర్లను తమవైపుకి తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగాంగానే కడియం దళితులను అణచివే శారని, ఆయన కుట్రలకు తాను కూడా బలయ్యా యని ఆరోపిస్తున్నారు. వర్థన్నపేట ఎమ్మెల్యేగా తాను మూడోసారి గెలిస్తే మంత్రి రేసులో ఉండేవాడినని, కానీ కడియం శ్రీహరి కుట్రలకు తాను బలయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ లో ఉండి ఎస్సీ నేతలను బయటకు పంపించే వరకు కడియం కుతంత్రాలు చేశారని విమర్శిం చారు. ఏ పార్టీలో ఉన్నా కడియం శ్రీహరి దళితులను ఎదగకుండా అణచివేశారని ఆరోపించారు. ఇక డైరెక్ట్‌గా కావ్యను టార్గెట్ చేసిన ఆరూరి గుంటూరుకు చెందిన కావ్యకు ఓట్లు ఎందుకు వేయాలని నిలదీస్తు న్నారు. అందులోనూ కావ్య భర్త మహమ్మద్ నజీరుద్దీన్ కావడంతో ఇక్కడ బీజేపీ సెంటిమెంట్‌ను ఎత్తు గడగా వాడుకుంటు న్నారు ఆరూరి. ఇందులో భాగంగానే గుంటూరు వాస్తవ్యురాలైన కావ్య నజీరు ద్దీన్‌కి వరంగల్ ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నిస్తున్నారు. గుంటూరు కోడలు కావ్య నజీరుద్దీన్ కావాలో.. వరంగల్ బిడ్డ ఆరూరి రమేష్ కావాలో స్థానికులు మీరే తేల్చుకోండి అంటూ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
ఆరూరి వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కావ్య తండ్రి కడియం శ్రీహరి. దేశంలో మతం మారినంత మాత్రాన కులం మారిపోదని.. పిల్లలకు తండ్రి కులమే వర్తిస్తుందని ఆరూరిపై మండిపడ్డారు. ఓటమి భయంతోనే వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. తాను ఆరూరిలా భూకబ్జాలకు పాల్పడ లేదని.. తన 30 ఏళ్ల రాజకీయ జీవితం తెరిచిన పుసస్తకమని తనదైన స్టైల్‌లో కౌంటర్ ఎటాక్ చేశారు. ఇక కాంగ్రెస్‌లో కడియం చేరికపై రాజకీయ దుమారం రేపుతోంది. బీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకుని మరీ కాంగ్రెస్‌లో చేరారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై మండిపడ్డ కడియం.. తాను పైసలు తీసుకు న్నట్టు నిరూపించాలని ఆరూరికి సవాల్ విసిరారు. తానెప్పుడూ బీఆర్ఎస్ పార్టీ నేతల నుంచి డబ్బు తీసుకోలేదన్న ఆయన.. ఒకవేళ తీసుకున్నానని నిరూపిస్తే.. తన కూతురు కావ్యను వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పిస్తామని తెలిపారు. ఆరూరి ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతున్నారని.. రాజకీయ ఎదుగు దలకు దోహదపడిన తనకే వెన్నుపోటు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇక పనిలో పనిగా మందకృష్ణ మాదిగపై కూడా విరుచుకుపడ్డారు కడియం శ్రీహరి. మాదిగలకు ద్రోహం చేస్తుందే మందకృష్ణ అని మండిపడ్డారు. బీజేపీకి ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులు అంటే గిట్టదని.. అలాంటి పార్టీకి ఓటు వేయమని ఎలా చెబుతారని నిప్పులు చెరిగారు. మందకృష్ణ నాయకత్వం సరిగ్గా లేకనే MRPS చీలికలయ్యిందని విమర్శలు గుప్పించారు. మొత్తానికి వరంగల్ జిల్లాలో కడియం వర్సస్ ఆరూరి రాజకీయం కాకరేపుతోంది. మరి ప్రత్యర్థులుగా బరిలో దిగిన ఆరూరి, కావ్యలకు ప్రజలు ఏమేర మద్దతు ఇస్తారు..? తండ్రి చరిష్మా కావ్యకు కలిసొచ్చి ఢిల్లీ పార్లమెంట్‌లో అడుగుపెడతారా..? లేదంటే మోదీ హావాతో ఆరూరి విజయం ఖాయమా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.