స్వతంత్ర వెబ్ డెస్క్: ఉన్నత వ్యక్తిత్వ వికాసానికి శాకాహారం ఎంతగానో దోహదం చేస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని జమ్మిగడ్డలో పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్ మెంట్ సూర్యాపేట – పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్ట్ హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో తలపెట్టిన మెగా శాకాహార ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి, జెండా ఊపి ప్రారంభిచారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హింసా చోడో.. హంసా పకడో సిద్దాంతంతో బభారత దేశాన్ని అహింసాయుత దేశంగా మార్చడానికి బ్రహ్మర్షి పత్రీజీ నేతృత్వంలో పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ చేస్తున్న కృషి ఎనలేనిదని కొనియాడారు. నేటి సమాజానికి కావాల్సింది సంహారం కాదు సంస్కరణ అని పేర్కొన్నారు. శాకాహారం తీసుకోండి.. ఎక్కువకాలం జీవించండని పిలుపునిచ్చారు. శాకాహారం ఆయుష్షును పెంచతుందన్న మంత్రి. కూరగాయల్లో ఫైబర్, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ శరీరానికి కావాల్సిన మోతాదులో ఉంటాయన్నారు. వెజిటేరియన్ ఫుడ్ వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది అన్న మంత్రి, మాంసాహారం తినేవాళ్లకంటే.. శాకాహారులు స్లిమ్‌గా వుంటారన్నారు. శాకాహారంలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుందన్నారు.
అందుకే శాకాహారానికి అలవాటు పడితే బరువు తగ్గుతారని తెలిపారు. కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల.. రక్తప్రసరణ సరిగా జరిగి.. గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందన్నారు. కూరగాయల్లో ఐరన్, పోషకాలు సమృద్దిగా ఉంటాయి కాబట్టి హృద్రోగాలకు దూరంగా ఉండవచ్చన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మునిసిపల్ చైర్ పర్సన్ పెరుమాల అన్నపూర్ణ, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, ఇమ్మడి సోమ నర్సయ్య, ఉప్పల ఆనంద్, జుట్టు కొండ సత్యనారాయణ, తోట శ్యామ్ తదితరులు ఉన్నారు.