ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో దారుణ హింసా కాండ చెలరేగి ఏడాది అయింది. ఏడాదిగా అక్కడి ఘర్షణలు, హింసాకాండ అడపా దడపా కొనసాగుతూనే ఉన్నాయి.జాతి పరమైన విద్వేషం తో అర్థంలేని హత్యలు, లైంగికపరమైన అత్యాచారాలతో మణిపూర్ అతలాకుతలం అయింది. నిరుడు మే 3న టర్బంగ్ లో హింసాకాండ వార్త ,అటు బిష్ణు పూర్, చురా చంద్ఫూర్ జిల్లాలకు , ఇంఫాల్ వ్యాలీకి వ్యాపించడంతో దౌర్జన్యకాండ ఆ ప్రాంతాలకు పాకింది. శాంతి భద్రతల పరిరక్షణలో కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలకు నిలువెత్తు నిదర్శనం మణిపూర్.
2023 మే 3న మణిపూర్ లో మెయిటీ , కుకీ జాతుల మధ్య చెలరేగిన హింసాకాండలో 224 మంది చనిపోయారు. దాదాపు 60 వేల మంది నిరాశ్రయులయ్యారు. హింస, దౌర్జకాండకు భయపడి పారిపోయి.. పునరావాసం, సహాయ శిబిరాల్లో మగ్గుతున్నారు. మరి కొన్ని కుటుంబాలు ప్రాణభయంతో పొరుగున ఉన్న మిజోరాం, అసోం, మేఘాలత రాష్ట్రాలకు పారిపోయారు. ఏడాదిగా వందలాది ఇళ్లు, వ్యాపారసంస్థలు, చర్చ్ లు, ఇతర ధార్మిక సంస్థలు దగ్ధమయ్యాయి. సాయుధ మూకలు పోలీసు స్టేషన్లను లూటీ చేసి ఆయుధాలు పట్టుకుపోయారు. కేంద్రమంత్రి, మణిపూర్ బిజేపి అధ్యక్షురాలి తగులపడిపోయింది. మణిపూర్ భవిష్యత్ అగమ్యగోచరంగా తయారైంది. చురా చంద్ పూర్ జిల్లాలో సెహ్కెన్ గ్రామంలోని శ్మశానవాటికలో సమాధులు దారుణ హత్యాకాండకు అద్దంపడుతున్నాయి. ఇంత జరుగుతున్నా.. సీఎం రాజీనామా చేయలేదు. మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వానికి ఢోకా లేదు.
ఏడాదిగా మెయిటీ, కుకీల మధ్య వైషమ్యాలు పెరిగిపోయాయి. తమ మనుగడ కోసం ప్రత్యేక పాలనాయంత్రంగం ఏర్పాటు చేయాలని కుకీలు డిమాండ్ చేస్తున్నారు. అయితే రాష్ట్ర విభజనకు అంగీకరించే ప్రసక్తే లేదని మెయిటీలు భీష్మిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికీ ఇదే విషయాన్ని మెయిటీలు స్పష్టంచేశారు. కుకి, మెయిటీ ప్రతినిధుల బృందం ఢిల్లీకి వచ్చి తమ డిమాండ్ తెలుపుతూ ప్రదర్శనలు చేస్తున్నారు. న్యూఢిల్లీ, మణిపూర్ లలో ప్రెస్ మీట్లు, న్యూస్ రిపోర్టర్లకు వాట్సప్ మెసేజ్ లలో తమ డిమాండ్ లు తెలుపుతూనే ఉన్నారు. అయినా ఓ పరిష్కారం వైపు అడుగులు పడలేదు. మణిపూర్ లోని ఇన్నర్ మణిపూర్, ఔటర్ మణిపూర్ నియోజకవర్గాలకు ఏప్రిల్ 19, ఏప్రిల్ 26 తేదీల్లో జరిగిన ఎన్నికల్లో కుకీలు పాల్గొనలేదు. పోలింగ్ సమయంలోని కాల్పులు హింసాకాండ కారణంగా డజన్ పైగా పోలింగ్ కేంద్రాలలో రీపోల్ కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికలతో నిమిత్తం లేకుండా మణిపూర్ లో రాజకీయ అనిశ్చిత పరిస్థితి కొనసాగుతోంది.
మణిపూర్ లో ఈ ఏడాది కాలంలో పరిస్థితులు కాస్త చక్కబడ్డా.. అసాధారణ స్థితి కూడా కొనసాగుతోంది. కుకీ ఎమ్మెల్యేలు కూడా స్వేచ్ఛగా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే పరిస్థితి లేదు. ఇంఫాల్ కు ప్రయాణం అంటే .. కుకీలకు ప్రాణాంతకమే. మెయిటీ ల పరిస్థితి కూడా ఏమంత మెరుగ్గా లేదు. వారెవరూ కొండ జిల్లాలను దాటి వెళ్లేందుకు సిద్ధంగా లేరు. పొరుగున ఉన్న మిజోరంలో కూడా మిజోలు, కుకీలు జాతి కారణంగా వారు సురక్షితంగా భావించడం లేదు. మిజోరంలో పనిచేస్తున్న పలువురు మెయిటీ స్వస్థలాలకు చేరుకున్నారు.మణిపూర్ లో మెయిటీలు మెజారిటీగా ఉండే ఇంఫాల్ లోయలో కానీ, కుకీల ప్రాబల్యం అధికంగా ఉన్న చురాచంద్ పూర్ లో కానీ.. ఎవరూ సురక్షితంగా, ధైర్యంగా కన్పించడం లేదు.. భయం భయమే.. పౌరులకు భద్రత కల్పించడంలో పోలీసులు వైఫల్యం కన్పిస్తుంది. దీంతో రాష్ట్రమంతటా కేంద్ర బలగాలు మోహరించారు. మణిపూర్ పొరుగు రాష్ట్రాలలోనూ.. కేంద్రబల గాలు పహరా తప్పడం లేదు.ఈశాన్య భారతంలో కీలకమైన మణిపూర్ లో ఏడాదిగా సుదీర్ఘంగా హింస, దౌర్జన్య కాండ జరుగుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆస్తుల పరిరక్షణలో విఫలమైనా.. ఇంతవరకూ ఆ సమస్యకు ఓ పరిష్కారం కనుగొనే దిశలో అడుగులు పడలేదు. చర్చల ద్వారా అన్నివర్గాలను కలుపుకుని రాజకీయ పరమైన చక్కటి పరిష్కారం కనుగొనేందుకు నిర్మాణాత్మక కృషి జరగాలి.


