సొంతగడ్డపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఆ జట్టుపై లక్నో సూపర్ జెయింట్స్ 28 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా లక్నో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ 81 పరుగులు, పూరన్ 40 నాటౌట్‌తో చెలరేగారు. అనంతరం బెంగళూరు 19.4 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. నిప్పులు చెరిగే బంతులతో మరోసారి లక్నో పేస్ బౌలర్ మయాంక్ యాదవ్ హడలెత్తించాడు. వేగానికి తోడు కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి ఐపీఎల్ టోర్నీలో లక్నో జట్టుకు వరుసగా రెండో విజయాన్ని అందించాడు.
లక్నో జట్టు ఓపెనర్ డికాక్ ఆరంభం నుంచే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. టాప్లీ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో అతను 3 బౌండరీలు, సిరాజ్ మూడో ఓవర్లో 2 సిక్స్‌లు బాదాడు. మరోవైపు కెప్టెన్ కేఎల్ రాహుల్ 20 పరుగులు తక్కువే చేసినా…దేవదత్ పడిక్కల్ విఫలమైనా…లక్నో ఇన్నింగ్స్‌పై ఏ మాత్రం ప్రభావం పడలేదు. 36 బంతుల్లో డికాక్ ఫిఫ్టీ పూర్తవగా జట్టు స్కోరు 12వ ఓవర్లోనే వందకు చేరింది. స్టోయినిస్ 15 బంతుల్లో 24 పరుగులతో ధాటిని ప్రదర్శించగా, ఆఖరులో పూరన్ మెరుపులతో లక్నో భారీ స్కోరు చేయగలిగింది.
ఇక బెంగళూరు ఇన్నింగ్స్ ఆరంభంలో కొద్ది సేపు బాగుంది. కెప్టెన్ డుప్లెసిస్ బౌండరీలతో వేగం పెంచగా, నవీనుల్ నాలుగో ఓవర్లో కోహ్లి సిక్స్‌తో టచ్‌లోకి వచ్చాడు. మరుసటి ఓవర్ తొలి బంతికి కోహ్లి ఫోర్ కొట్ట డంతో స్కోరు 40 పరుగులు, సున్నా వికెట్లతో బాగానే ఉంది. అక్కడే కోహ్లి నిష్క్రష్కమించగా, మరు సటి ఓవర్లో డుప్లెసిస్ రనౌటయ్యాడు. చెత్త షాట్ ఆడిన మ్యాక్స్‌వెల్ ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యాడు. 43 పరుగుల వద్దే బెంగళూరు ముగ్గురు హిట్టర్లను కోల్పోయింది. దీంతో బెంగళూరు కష్టాల్లో పడింది. మయాంక్ అద్భుత బంతికి గ్రీన్ 9 పరుగుల వద్ద బౌల్డ్ కాగా..అనూజ్ జట్టును ఆదుకోలేకపో యాడు. ఇక కార్తీక్ కూడా వెంటనే అవుట్ కావడంతోనే బెంగళూరు ఖేల్ ఖతమైంది.


