బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. బంగాళా ఖాతంలో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే రెండు రోజుల్లో ఈశాన్య దిశగా కదులుతుందని అంచనా వేస్తున్నారు. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతా రామరాజు, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.అల్పపీడనం శుక్రవారం ఉదయానికి వాయు గుండంగా, శనివారం సాయంత్రానికి తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం తుఫాన్‌గా బలపడితే ఒమన్ సూచించిన రెమాల్‌గా పేరు పెడతారు. మరోవైపు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు ఆదివారం వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. ఈ నెల 25న ఈ తుఫాన్ పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు.


