Mohammed Faizal |కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అనర్హత వేటుపై దేశ వ్యాప్తంగా చర్చ జరగుతున్న వేళ.. ఇటీవల అనర్హతకు గురైన మరో ఎన్‌సీపీ నేత మహమ్మద్ ఫైజల్ పై గతంలో వేసిన అనర్హత వేటును లోక్‌సభ సచివాలయం ఎత్తివేసింది. ఆయనపై అనర్హతను ఉపసంహరించుకుంటున్నట్లు, ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు లోక్‌సభ సెకట్రేరియట్ ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసింది. తన అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే లోక్ సభ సెక్రటేరియట్ కీలక నిర్ణయం తీసుకుంది. 2009లో కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ సలీహ్‌పై దాడి చేశారన్న కేసులో ఈ ఏడాది జనవరి 10వ తేదీన లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్‌ను కవరత్తీ సెషన్స్ కోర్టు దోషిగా తేల్చింది. పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
తీర్పు వెలువడిన మూడు రోజుల తర్వాత అంటే జనవరి 13వ తేదీన లోక్‌సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో కవరత్తీ సెషన్స్ కోర్టు తీర్పును మహమ్మద్ ఫైజల్(Mohammed Faizal) కేరళ హైకోర్టులో సవాల్ చేశారు. దీంతో సెషన్స్ కోర్టు తీర్పు అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో ఆయనపై పడిన అనర్హత వేటు చెల్లుబాటు కాకుండా పోయింది. అయినప్పటికీ.. ఫైజల్ సభ్యత్వాన్ని లోక్‌సభ సచివాలయం పునరుద్ధరించలేదు. దీన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరపుతున్న వేళ.. ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని న్యాయస్థానం పునరుద్దరించింది.
Read Also: కాసేపట్లో కర్ణాటక ఎన్నికల షెడ్యూల్.. వయనాడ్ ఉప ఎన్నికపై ఉత్కంఠ..
Follow us on: Youtube, Instagram, Google News