చీకటిపడితే చాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తున్నారు. టార్చ్‌లైట్స్ వేసుకుని తవ్వకాలు చేపడుతున్నారు. జల్లెడలు, మెటల్ డిటెక్టర్లు వినియోగిస్తున్నారు. బంగారు నాణేలు దొరికాయని చెప్పుకుంటున్నారు. దీంతో రాత్రుళ్లు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకుని గుప్త నిధుల వేట సాగిస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లోని అసిర్‌గఢ్ కోట వద్ద బంగారం కోసం టార్చ్ లైట్లు, జల్లెడలు, మెటల్ డిటెక్టర్లతో డజన్ల కొద్దీ జనం గుమిగూడిన పరిస్థితి. విక్కీ కౌశల్ నటించిన చావా చిత్రంలో బుర్హాన్‌పూర్‌ను బంగారు గనిగా పేర్కొనడం ఈ గుప్త నిధుల ప్రచారానికి ఆజ్యం పోసింది.
ఒక దర్గా దగ్గర జాతీయ రహదారి నిర్మాణంలో నిమగ్నమై ఉన్న జెసిబి యంత్రం మట్టిని తవ్వి, ఆ మట్టిని స్థానిక గ్రామస్తుడు హరూన్ షేక్ పొలంలో పడేసిన తర్వాత పుకార్లు మొదలయ్యాయి. ఆ తర్వాత, కార్మికులకు పురాతన కాలం నాటి లోహ నాణేలు దొరికినట్టు తెలిసింది. మొఘల్ కాలం నాటి బంగారం , వెండి నాణేలు దొరికాయని కూడా కొందరు పేర్కొన్నారు. అప్పటి నుండి, సమీపంలోని గ్రామాల నుండి ప్రజలు బంగారం కోసం ఆ ప్రదేశానికి వస్తున్నారు.
చావాలో ఇది ఛత్రపతి శంభాజీ మహారాజ్ ఒక ప్రధాన మిలిటరీ క్యాంప్‌గా ఉండేదని.. బంగారు గనులు ఉండేవని పేర్కొనడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది.
ఇక్కడ నిజంగా నాణేలను కనుగొంటున్నారని స్థానికులు చెబుతున్నారు, కానీ పట్వారీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. స్థానిక నివాసి మహ్మద్ వసీం తన ఆందోళనను వ్యక్తం చేస్తూ, “నాణేలు దొరుకుతున్నాయి . ప్రతి రాత్రి జనసమూహం పెరుగుతోంది. ఇతర గ్రామాల నుండి ప్రజలు వస్తున్నారు. చాలా మంది నాణేలు దొరికాయని చెబుతున్నారు. ప్రభుత్వం, పరిపాలన దీనిని విస్మరిస్తున్నాయి. నేను పట్వారీకి సమాచారం ఇచ్చాను, కానీ ఎటువంటి చర్య తీసుకోలేదు. ఏమి జరుగుతుందో సర్పంచ్‌కి కూడా తెలుసు” అని అన్నారు.
బుర్హాన్‌పూర్ ఒకప్పుడు సంపన్నమైన మొఘల్ నగరంగా ఉండేది. బంగారు, వెండి నాణేలను ఉత్పత్తి చేయడానికి ఇది ఒక టంకశాలగా ఉండేది అని చరిత్రకారులు చెప్పారు. యుద్ధ సమయాల్లో ప్రజలు తరచుగా తమ సంపదను సురక్షితంగా ఉంచడానికి భూగర్భంలో పాతిపెట్టేవారు. ఈ కారణం వల్లే ఎవరైనా తవ్వకాలు జరిపితే నాణేలు దొరికే అవకాశం లేకపోలేదని అంటున్నారు. అనధికారిక తవ్వకాల వల్ల విలువైన చారిత్రక సంపదకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.