దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. జూన్ ఒకటితో ఆఖరి దశ ముగియ నుంది. ప్రస్తుతం 18వ లోక్‌సభకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పలువురు అభ్యర్థులు ఎంపీలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే, వీరిలో కొందరు తొలిసారి పోటీ చేస్తుండ గా మరి కొందరు అంతకంటే ఎక్కువసార్లు పోటీ చేశారు. మళ్లీ చేస్తున్నారు. ఇలాంటి వేళ ఇప్పటివరకు అత్యధిక సార్లు లోక్‌సభ ఎంపీలుగా పని చేసిన వారెవరు ? ఆ వివరాలేంటి ?
సార్వత్రిక ఎన్నికల సందడి చివరి అంకానికి వచ్చేసింది. వచ్చేనెల ఒకటిన జరగనున్న ఏడో దశ పోలింగ్‌తో ఎన్నికల ఘట్టానికి తెరపడనుంది. జూన్ నాలుగున ఫలితాలు వెలువడనున్నాయి. ఆ తర్వాత 18వ లోక్‌సభ కొలువు తీరనుంది. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటికే ఎంతో మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా ఇంకొందరు అందుకు సిద్ధమయ్యారు. అయితే, ఇందులో తొలిసారి ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారు కొందరైతే, ఒకటి కంటే ఎక్కువ సార్లు బరిలో దిగిన వారు, నువ్వా-నేనా అన్నట్లుగా ప్రత్యర్థులతో తలపడుతున్న వారు ఉన్నారు. ఈ క్రమంలోనే లోక్‌సభకు ఎక్కువ సార్లు ఎన్నికైన అభ్యర్థులు కొందరున్నారు. 1952లో తొలిసారి పార్లమెంటుకు ఎన్నికలు జరగగా ఇప్పటివరకు 17 సార్లు ఎలక్షన్లు జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు 18వ లోక్‌సభ కోసం జరుగుతున్నాయి. ఇలాంటి వేళ అత్యధికంగా లోక్‌సభకు ఎన్నికైన వారి వివరాలను ఓసారి పరిశీలిస్తే.. మొదటగా ఇంద్ర జిత్ గుప్తా గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సార్లు గెలిచిన వ్యక్తిగా కమ్యూ నిస్టు నేత ఇందర్ జీత్ గుప్తా రికార్డు సృష్టంచారు. 1960లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన ఆయన 1999లో చివరిసారి ఎంపీ అయ్యారు. తన రాజకీయ జీవితంలో మొత్తం 11సార్లు ఎంపీగా విజయం సాధించారు ఇంద్రజీత్
గుప్తా.
సోమనాథ్ ఛటర్జీ, పీఎం సయీద్ తమ రాజకీయ జీవితంలో మొత్తం పదిసార్లు ఎంపీలుగా ఎన్నికయ్యారు. అసోంలోని తేజ్‌పూర్‌లో జన్మించిన సోమ్‌నాథ్ ఛటర్జీ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం పదిసార్లు గెలుపొందారు.1996లో అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందారు. ఇక, పీఎం సయీద్ 1967 నుంచి 1999 వరకు వరుసగా పదిసార్లు ఎంపీ అయ్యారు. ఆయన తొలిసారి జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి తర్వాతి స్థానాల్లో అటల్ బిహారీ వాజ్‌పేయి ఉన్నారు. ప్రధాని పదవి సైతం అలంకరించిన ఆయన తన పొలిటికల్ కెరీర్‌లో 9సార్లు లోక్‌సభ సభ్యుడిగా విజయం సాధించారు. రెండుసార్లు రాజ్యసభ ఎంపీగా గెలుపొందారు. మొత్తం నాలుగు దశాబ్దాలకు పైగా పార్లమెంటు అనుభవం అటల్‌జీ సొంతం. ఇక, తొమ్మిదిసార్లు గెలిచిన నేతల్లో కమల్‌నాథ్ ఒకరు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా సైతం పనిచేశారాయన. చింద్వారా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే ఆయన మొత్తం 9 సార్లు విజయం సాధించారు. 1980లో తొలిసారి ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేశారు.మాధవ్ రావ్ సింధియా 1971లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు. గ్వాలియర్ పార్లమెంటు స్థానం నుంచి మొత్తం తొమ్మిదిసార్లు విక్టరీ కొట్టారు. అంతేకాదు.. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని సైతం ఆయన ఓడించారు. ఇక, ఖగపతి ప్రధాని సైతం లోక్‌సభకు 9సార్లు ప్రాతినిథ్యం వహించారు. ఒడిషాలోని నబరంగ్‌పూర్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి విజయాలు సాధించిన ఆయన.. 1999లో రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కోరాపుట్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి తిరుగులేని విధంగా విజయాలు సాధించారు కాంగ్రెస్ నేత గిరిధర్ గోమాంగ్. ఒడిషా ముఖ్యమంత్రిగా సైతం పనిచేసిన ఆయన లోక్‌సభ ఎన్నికల్లో తొమ్మిదిసార్లు విజయం సాధించారు. అటు.. 9 సార్లు విజయం సాధించిన వారిలో బీహార్‌కు చెందిన రామ్ విలాస్ పాశ్వాన్ సైతం ఉన్నారు. హాజీపూర్ నుంచి ఎనిమిది సార్లు, రోస్రా లోక్‌సభ స్థానం నుంచి ఒకసారి గెలుపొందారు. అటు లోక్‌సభ ఎన్నికల్లో తొమ్మిదిసార్లు గెలిచిన వారిలో జార్జి ఫెర్నాండెజ్ సైతం ఒకరు. 1967లో తొలిసారిగా ముంబై సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విక్టరీ కొట్టారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్ నుంచి ఐదుసార్లు, నలంద స్థానం నుంచి మూడుసార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు జార్జి ఫెర్నాండెజ్.
లోక్‌సభకు తొమ్మిదిసార్లు ప్రాతినిథ్యం వహించిన వారిలో సీపీఎం నేత వాసుదేబ్ ఆచార్య ఒకరు. బంకురా ఎంపీ స్థానం నుంచి గెలిచిన ఆయన కమ్యూనిస్టుల్లో తిరుగులేని నేతగా పేరు తెచ్చుకున్నారు. 1980లో తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు వాసుదేబ్ ఆచార్య. ఇక, మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ నేత మాణిక్‌రావ్ హోడల్లా గవిత్ సైతం తొమ్మిదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1981లో మొట్టమొదటిసారి ఎంపీగా విజయం సాధించిన ఆయన తిరుగులేని విధంగా తన జైత్రయాత్ర కొనసాగించారు. కేవలం వీళ్లే కాదు. బరేలీ స్థానం నుంచి సంతోష్ గంగ్వార్, సుల్తాన్ పూర్ నుంచి మేనకాగాంధీ, ఇండర్ లోక్‌సభా స్థానం నుంచి సుమిత్రా మహాజన్ ఎనిమిదిసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. దేశ రాజకీయాల్లో తమదైన ముద్రవేశారు.


