తెలంగాణలో హోరా హోరీగా సాగిన లోక్ సభ ఎన్నికల పోరు ముగిసింది. జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఎలక్షన్ కోడ్ సైతం ముగియనుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టీ నామినేటెడ్ పోస్టులపై పడింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆయా పదవులు భర్తీ చేయనున్న నేపథ్యంలో పొత్తు ధర్మం ప్రకారం తమకు ప్రాధాన్యం కల్పించాలని కోరుతున్నారు సీపీఐ, టీజేఎస్ నేతలు. మరి వారి ఆకాంక్షలు ఎంత మేరకు ఫలిస్తాయి? ప్రభుత్వ పదవుల్లో ఏ మేరకు ప్రాధాన్యం లభిస్తుందన్నది ఆసక్తి రేపుతోంది.
మొదటి లిస్ట్‌లో అవకాశం కల్పించలేదు. కనీసం రెండో జాబితాలోనైనా ఛాన్స్ ఇవ్వండి.! త్వరలోనే నామినేటెడ్ పోస్టులను సీఎం రేవంత్ రెడ్డి భర్తీ చేస్తారన్న ఊహాగానాల మధ్య విన్పిస్తున్న కోర్కెలు, డిమాండ్ల ఇవి. గతేడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా విపక్షాలన్నీ ఏకమయ్యాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సీపీఐ, తెలంగాణ జనసమితి తమవంతు సాయం చేశాయి. పదేళ్లుగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించి గులాబీ పార్టీని గద్దె దింపేందుకు తమ వంతు కృషి చేశారు ఆయా పార్టీల నేతలు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ వరకు విస్తరించి ఉన్న తెలంగాణలో ఎక్కడికక్కడ తమ తమ పార్టీల తరఫున కేడర్‌ను ఉత్సాహపరిచి ఎన్నికల్లో కదంతొక్కారు. దీంతో అన్నీ కలిసి వచ్చి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సీఎంగా రేవంత్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీపీఐ, తెలంగాణ జన సమితి పార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా కేటాయించ లేదు. కానీ, పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో ఉండే వివిధ రకాల కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు, ఎమ్మెల్సీలు, ఇతరత్రా పదవుల్లో ప్రాధాన్యం కల్పిస్తామని హామీనిచ్చారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమ ఆశలు నెరవేరతాయని భావించారు. కానీ, తొలి జాబితాలో తమ పార్టీలకు ప్రాతినిథ్యం లభించకపోవడంతో మలి జాబితా రెడీ అవుతోందన్న అంచనాల వేళ సీఎం రేవంత్ రెడ్డితో ఆయా పార్టీల నేతలు సమావేశమయ్యారు. తమ ఒప్పందంలో భాగంగా అవకాశం కల్పించాలని కోరారు. ఒక్క అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు. ఎంపీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క లోక్ సభ సీటు కూడా ఈ రెండు పార్టీలకూ కేటాయించలేదు. దీంతోఆయా సందర్భాల్లో జరిగిన ఒప్పందాలను గుర్తు చేశారు నేతలు. సీపీఐ తరఫున చూస్తే ఎమ్మెల్యేగా కూనంనేని సాంబశివరావు మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే, జాతీయ కార్యదర్శి నారాయణతోపాటు,చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకట రెడ్డి సహా మరికొందరు ప్రముఖ నేతలున్నారు. అయితే, ఎమ్మెల్సీ పదవుల భర్తీ వచ్చే ఏడాది వరకు కుదరని పరిస్థితి. దీంతో ప్రభుత్వ పదవులైన నామినేటెడ్ పోస్టుల్లో తమకు, తమవారికి అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకెళ్లారు నేతలు. ఇంకా చెప్పాలంటే రాష్ట్ర స్థాయి నేతలకు ఆ స్థాయి లోని పదవులు. జిల్లా స్థాయి నాయకులకు సంబంధిత పదవులు ఇవ్వాలని కోరారు.
మరోవైపు, ఇప్పటికే తెలంగాణ జన సమితి చీఫ్ కోదండరామ్ పేరు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి పంపగా అది కాస్తా పెండింగ్‌లో ఉంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అలాగే టీజేఎస్‌లో ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన పోటీ చేయాలని భావించినా పొత్తులో భాగంగా వెనక్కి తగ్గారు. ఇక, బైరి రమేష్, దర్మార్జున్‌తో పాటు మరి కొంత మంది పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ కోదండరాంకు అండగా ఉన్నారు. వీరికి అవకాశం ఇవ్వాలని కోదండరాం కోరుతున్నారు.వాస్తవానికి ఎన్నికల కు ముందు మొత్తం 37 మందితో నామినేటేడ్ పోస్టుల లిస్ట్ ప్రకటించగా, రెండో లిస్ట్‌లో మరి కొంత మందికి నామినేటెడ్ పోస్టులలో అవకాశం కల్పించనున్నారు. అయితే, తొలిదశలో ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసి పోటీకి దూరంగా ఉన్న వాళ్లు, పార్టీ అనుబంధ సంఘ నేతలకు అవకాశం ఇచ్చారు. రెండో విడత లిస్ట్‌పై పోలింగ్ ముగిసినప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి వీటిపై కసరత్తు చేస్తున్నారు. రుణమాఫీకి సంబంధిం చి రైతు కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే విద్యా శాఖలో సమూల మార్పులు తెచ్చేందుకు విద్యా కమీషన్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ రెండు పోస్టుల కు కాంగ్రెస్ నేత కోదండరెడ్డితో పాటు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరు మురళి పేర్లను సీఎం రేవంత్ పరిశీలి స్తున్నట్ల జోరుగా చర్చ నడుస్తోంది.
లోక్ సభ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే 37 మంది కాంగ్రెస్ నేతలకు నామినేటేడ్ పోస్టులు ప్రకటించినా, కోడ్ కారణంగా వారి నియామకంపై ఉత్తర్వులు ఇవ్వటం సాధ్యం కాలేదు. దీంతో వాళ్లు బాధ్యతలు చేపట్టలేదు. అయితే కోడ్ ముగి సిన తరువాత వీరి నియామకంపై జీవో లు ఇవ్వనున్నారు. అదే సమయంలో తొలి లిస్ట్ లో సైతం కొన్ని పదవులు, పేర్లలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. తమకు ఇచ్చిన పదవులపై కొందరు నేత లు అసంతృప్తిగా ఉన్నారని, సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయా నాయకులు తమ సన్నిహితుల దగ్గర వాపోతున్న ట్లు తెలుస్తోంది. దీంతో మార్పులు చేర్పులు తప్పవన్న వాదన విన్పిస్తోంది. అటు మరి కొందరు తమ పేర్లు సెకండ్ లిస్ట్ లో అయినా ఉండేలా చూడాలని కోరుతూ సీనియర్ కాంగ్రెస్ నేతల చుట్టూ గాంధీ భవన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తు న్నారు.దాదాపుగా దశాబ్దకాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సహజంగానే పదవుల పంపకంపై పోటీ ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితుల మధ్య రెండో జాబితాలోనైనా తెలంగాణ జన సమితి, సీపీఐ నేతలకు కార్పొరేషన్ పదవులు కట్టబెడతరా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది.


