కూటమి వర్సెస్ జగన్ ఎపిపోడ్‌తో ఏపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ కూటమి సర్కార్‌పై జగన్ పోరాటానికి దిగడంతో ఆ హీట్ మరింత పెరిగింది. ఢిల్లీ ధర్నాకు ఇండియా కూటమి నేతలు మద్దతు ప్రకటిచండంతో ఇప్పటి వరకూ బీజేపీకి దగ్గరగా ఉన్న జగన్.. ఇండియా కూటమికి దగ్గరవుతున్నారన్న టాక్‌తో రాజకీయం రంజుగా సాగుతోంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని,.. చంద్రబాబు సర్కార్ రాజకీయ కక్షలకు పాల్పడుతుందని, వైసీపీ నేతలు, కార్యకర్తలు భయం గుప్పిట్లో బతకాల్సి వస్తోందని ఆరోపిస్తున్నారు జగన్. ఈ నేపథ్యంలోనే కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నాకు దిగారు. జంతర్ మంతర్ వద్ద వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, తన మద్దతుదారులతో కలిసి ధర్నా చేపట్టిన జగన్ నిరసన వ్యక్తం చేశారు. ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఫోటో ఎగ్జిబిషన్, వీడియోలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ధర్నాకు ఇండియా కూటమి నేతలు సంఘీభావం ప్రకటించారు. యూపీ ఎస్పీ నేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, టీఎంసీ ఎంపీలు, ఉద్దవ్ శివసేన, అన్నాడీఎంకే, జేఎంఎం, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ ఎంపీలు మద్దతు తెలిపారు.
ఏపీలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని.. లోకేష్ రెడ్ బుక్ హోర్డింగ్స్ పెట్టారని.. పోలీసులు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నారని ఢిల్లీ వేదికగా చంద్రబాబు సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ఏకంగా మా పార్టీ ఎంపీ, మాజీ ఎంపీపైనే దాడి చేశారన్నారు. వైసీపీకి చెందిన వందల ఇళ్లపై దాడులు చేసి, పంటలను ధ్వంసం చేసి.. తిరిగి బాధితులపైనే కేసులు బనాయిస్తున్నారు అంటూ జగన్ తన ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక.. అధికారం కోల్పోయిన వారిపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. వైసీపీపై జరిగిన దాడులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ పార్టీ కార్యకర్తల కోసం పోరాడుతున్నారని చెప్పారు. ప్రజలు హింసను సహించరని.. ఇతరుల ప్రాణాల్ని తీయాల్సిన అవసరం లేదని అఖిలేష్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ కక్షలు సరైంది కాదని తెలిపారు.
వైసీపీ ధర్నాలో పాల్గొన్న అన్నాడీఎంకే ఎంపీ తంబిదురై ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు.. కేంద్రం జోక్యం చేసుకోవాలని తంబిదురై కోరారు. ఏపీ మణిపూర్ లా మారుతోందని..ఉద్దవ్ శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తెలిపారు. ఎవరికైనా అధికారం వస్తుంది.. పోతుందని.. అయితే ప్రతికార దాడులు దుర్మార్గమన్నారు. ఏపీలో చట్టబద్దమైన పాలన జరగడం లేదన్నారు ఉద్దవ్ శివసేన ఎంపీ సంజయ్ రౌత్. చంద్రబాబుకు ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండే అర్హత లేదని ఆయన మండిపడ్డారు. ఏపీకి కేంద్ర హోంశాఖ స్పెషల్ టీమ్ ను పంపి.. దాడులపై స్వతంత్రంగా దర్యాప్తు చేయాలని కోరారు.
ఇక ఇవాళ కూడా జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగనుంది. నేడు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, రాష్ట్రపతి ముర్ము అపాయింట్మెంట్ కోరిన నేపథ్యంలో వారితో భేటీ అయ్యే అవకాశం ఉంది. వారి అపాయింట్‌మెంట్ ఖరారు అయితే కనుక.. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై ఫిర్యాదు చేయనున్నారు. మరోపక్క ఇవాళ పలువురు నేతలను కలిసే అవకాశమున్నట్టుగా తెలుస్తోంది.